నెంబ‌ర్ 2:హ‌రీశ్‌-కేటీఆర్ రిప్లై ఇది

Update: 2015-10-04 10:01 GMT
తెలంగాణ రాష్ర్టంలో జరుగుతున్న స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం ఫ‌లితాలు ఎలా ఉన్న రాజ‌కీయ‌వ‌ర్గాల్లో మాత్రం కొత్త చ‌ర్చ‌కు తెర‌తీసింది. స్వ‌చ్ఛ తెలంగాణ‌ కార్య‌క్ర‌మం కేసీఆర్ కుటుంబంలో లుక‌లుక‌ల‌ను బ‌య‌ట‌పెట్టింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. గాంధీ జయంతి రోజున ముఖ్యమంత్రి కేసీఆర్‌ అల్లుడు, భారీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు సొంత నియోజకవర్గమైన మెదక్‌ జిల్లా సిద్దిపేటతోపాటు ముఖ్యమంత్రి కుమారుడు, పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు సొంత నియోజకవర్గం కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలోనూ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇందులో గొప్ప విశేషం, విషయం ఏముంది అనుకోకండి. అసలు సంగతి ఏమిటంటే ముఖ్యమంత్రి కుటుంబంలోనే ఈ 'స్వచ్ఛ తెలంగాణ' పోటీ ప్రొత్సహిస్తోంది. అది కూడా సీరియ‌స్ పోటీనే.

స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని అమలుచేయడంలో రాష్ట్రంలో మరెక్కడా లేని పోటీ ఈ రెండు నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. స్వచ్ఛ సిరిసిల్ల పేరుతో రాష్ట్రంలో 100 శాతం బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత తొలి నియోజకవర్గంగా ఒకవైపు కేటీఆర్‌ ప్రచారం చేసుకుంటుంటే, మరోవైపు సిద్దిపేట శుద్ధిపేట అని హ‌రీశ్‌ రావు ఇంకోవైపు పత్రికా ప్రకటనలు ఇచ్చుకున్నారు. త‌న కార్య‌క్ర‌మానికి అసెంబ్లీ స్పీకర్‌, మండలి ఛైర్మన్‌ ల‌ను ర‌ప్పించుకున్న హరీశ్‌ రావు వారితో డప్పు కొట్టించుకున్నారు కూడా. కేటీఆర్ కూడా హైద‌రాబాద్‌నుంచి మీడియాను తీసుకువెళ్లి ప్ర‌చారం పొందారు. ఇక‌ వారి సొంత మీడియాతో ప్ర‌చారం సంగ‌తి స‌రేస‌రి. ఇలా సిద్దిపేట, సిరిసిల్లలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్నారనేది సారాంశం అయిన‌ప్ప‌టికీ పోటీ వల్ల  ఇది తెర‌మీద‌కు వ‌చ్చింద‌ని. ఇదే మొద‌టిసారి కూడా కాద‌ని చెప్తున్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో చైనా పర్యటనలో హరీష్‌ రావు, కేటీఆర్‌ పోటీ పడి రాష్ట్రాన్ని పరిపాలించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హరీష్‌ రాజకీయ వ్యవహారాలు చక్కబెడితే, కేటీఆర్‌ అధికారిక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ తరహా పోటీ గత కొంతకాలంగా రాష్ట్రంలో కొనసాగుతోంద‌ని రాజకీయ పార్టీల నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. మ‌రోవైపు టీఆర్‌ఎస్ శ్రేణుల‌తోపాటు సర్కారులోనూ ఎవ‌రికి ప్రాధాన్యం ఇస్తే ఏంజ‌రుగుతుంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. అయితే సర్కారులో నెంబరు 2 ఎవ‌రని జ‌రుగుతున్న చ‌ర్చ హ‌రీశ్ - కేటీఆర్‌ ల వ‌ద్ద‌కు చేరింది. దీంతో ఈ పరిణామాలను గమనించి కేటీఆర్‌ ' మనమిద్దరం పోటీ పడుతున్నామని చెప్పదలుచుకున్నవా ?..రాంగ్ సిగ్న‌ల్స్‌ పోతున్నయి..' అని హరీష్‌ రావుతో అన్నట్లుగా ప్రచారం. అయితే సమయస్ఫూర్తికి మారుపేరైన హరీష్‌ రావు వెంటనే "అదేం లేదు బై..." అని దాట‌వేశార‌ట‌.
Tags:    

Similar News