దేవినేనికి హరీశ్ ఐదుసార్లు ఫోన్ చేశారా?

Update: 2016-05-16 07:04 GMT
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల మీద ఏపీ అధికారపక్షం అభ్యంతరాలు వ్యక్తం చేయటం ఓపక్క సాగుతుండగా.. మరోవైపు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మూడు రోజుల పాటు నిరసన దీక్ష చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవటం తెలిసిందే. ఏపీలో సాగుతున్న పరిణామాల ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్న మాటకు బలం చేకూరేలా తెలంగాణ మంత్రి హరీశ్ రావు మాటలు ఉండటం గమనార్హం. ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న భావన కలిగించేలా ఏపీఅధికార.. విపక్షాలు వ్యవహరిస్తున్న వేళ.. తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఉన్న వివాదాల్ని సెటిల్ చేసుకునేందుకు తాను ఎంతో ప్రయత్నిస్తున్నా.. ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన రావటం లేదని హరీశ్ ఆరోపిస్తున్నారు. సాగు.. తాగునీటి అంశాలకు సంబంధించిన ఏదైనా ఇష్యూలు ఉంటే ఇరుగుపొరుగున ఉన్న కర్ణాటక.. మహారాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందిస్తున్నాయని.. అందుకు భిన్నంగా ఏపీ సర్కారు వ్యవహరిస్తుందని హరీశ్ విమర్శిస్తున్నారు.

పులిచింతల విషయంలో చర్చలు జరిపేందుకు ఏపీ మంత్రి దేవినేని ఉమకు తాను స్వయంగా ఐదుసార్లు ఫోన్లు చేశానని.. విజయవాడ.. కడప.. హైదరాబాద్ ఇలా ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తానని తాను చెప్పానని అయినప్పటికీ దేవినేని నుంచి ఎలాంటి స్పందన లేదని హరీశ్ చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వంతో పోలిస్తే.. మిగిలిన రాష్ట్రాల వారు వెంటనే స్పందిస్తున్నారంటూ హరీశ్ చేసిన విమర్శ ఏపీ ప్రభుత్వం తప్పు చేస్తుందన్న భావన కలిగించేలా ఉండటం గమనార్హం.

గమనించాల్సిన అంశం ఏమిటంటే.. విభజన జరిగిన తొలినాళ్లలో సమస్యల పరిష్కారం కోసం తాము ఎంత ప్రయత్నించినా తెలంగాణ ప్రభుత్వం స్పందించటం లేదని అప్పట్లో ఏపీ అధికారపక్ష నేతలు ఆరోపణలు చేసేశారు. విభజన జరిగిన రెండేళ్లకు సీన్ రివర్స్ అయినట్లుగా.. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సర్కారు నేతలు సిద్ధం అవుతున్నా.. ఏపీ ప్రభుత్వం అంతగా రియాక్ట్ కాకపోవటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. హరీశ్ చేసిన ఆరోపణలకు దేవినేని సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరీశ్ స్వయంగా ఐదుసార్లు ఫోన్ చేసినా.. దేవినేని ఎందుకు రియాక్ట్ కానట్లు చెప్మా..?
Tags:    

Similar News