ఏం సెప్పినావ్ హరీశా!!

Update: 2015-12-14 05:44 GMT
మాటల మాంత్రికుడిగా పేరున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరంత కాకున్నా.. దరిదాపుల్లోకి వచ్చే అతి కొద్ది మంది నేతల్లో ఆయన మేనల్లుడు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఒకరు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేసే ఆయన.. తన మాటలతో ప్రత్యర్థులకు భారీ పంచ్ లే ఇచ్చేయటం ఆయనకు అలవాటే. తాము చేసిన పనుల్ని సమర్థించుకోవటంలో హరీశ్ తర్వాతే ఎవరైనా. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల్ని కారులోకి ఎక్కించేసుకున్న అంశం విపక్షాలు గగ్గోలు పెడుతున్న వేళ.. తాము చేసింది ఏ మాత్రం తప్పు కాదని చెప్పటమే కాదు.. అదెలా కరెక్ట్ అంటూ చేసిన సూత్రీకరణ విన్న వారు ఎవరైనా.. హరీశ్ తెలివితేటలకు ఫిదా కావాల్సిందే.

ఇంతకీ హరీశ్ నోటి వెంట నుంచి వచ్చిన ఆణిముత్యాల్లాంటి ఆ వాదన ఏమిటంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు నిజాయితీ అన్నది లేదని.. నిజంగా వారికి నిజాయితీనే ఉంటే.. పొన్నం ప్రభాకర్.. శ్రీధర్ బాబు.. గండ్ర వెంకట రమణా రెడ్డి లాంటి వాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుచోకుండా.. అమాయకుల్ని బరిలోకి దింపారని.. బలం లేదు.. గెలవమన్న ఉద్దేశంతోనే వారు సీన్లోకి రాలేదన్నారు.

‘‘బలం లేదని అమాయకుల్ని పెట్టిండ్రు. ఆ అమాయకులు నీకే తెలివితేటలు ఉన్నయ.. నాకూ ఉన్నయ్ అని జై తెలంగాణ అని టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని చెప్పిండు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటంటే.. దానికి సరైన లీడర్ లేడు. వాళ్ల నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. భట్టి విక్రమార్క.. జానారెడ్డి.. ఇలా చాలామందే ఉన్నారు. ఎవరేం మాట్లాడతారో ఎవరికీ తెల్వదు. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడు. తెలుగుదేశం పార్టీకి క్యాడర్ లేదు. బీజేపీ పార్టీకైతే జనం లేరు’’ అంటూ విమర్శించారు. పార్టీలోకి లాగేసుకోవటమే కాదు.. తాము చేసిన పనిని సమర్థించుకున్న తీరు చూస్తే.. హరీశ్ తెలివితేటలకు ముచ్చటపడిపోవాల్సిందే.
Tags:    

Similar News