హరీష్‌ కు ఇస్తారు... కాని...!?

Update: 2019-02-17 05:29 GMT
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఇక రెండు రోజులే మిగిలి ఉంది. వారికి ఇస్తారు... వీరిని మంత్రిని చేస్తారనే ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. కుల సమీకరణలు, వర్గ సమీకరణలు, బీసీల కోటా, మహిళల వాటా.... ఇలా అన్ని అంశాలు చర్చల్లోకి వస్తున్నాయి. వీటితో పాటు ప్రధానంగా చర్చల్లోకి వస్తున్న పేరు మాత్రం మాజీ మంత్రి, ముఖ్యమంత్రి మేనల్లుడు తన్నీరు హరీష్ రావుదే. తెలంగాణ ప్రత్యేక ఉద్యమ కాలం నుంచే హరీష్ రావు తన మేనమామ కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెంట ఉన్నారు. ఒక దశలో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆయనే నెంబర్ టు అనే పేరు కూడా వచ్చింది.

తొలి దశ తెలంగాణ ప్రభుత్వంలో హరీష్ రావు పాత్ర చాలానే ఉంది. ఇక మలి దశ ఎన్నికల్లో కూడా హరీష్ రావు చాలా కష్టపడ్డారనే పేరు ఉంది. అయితే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని, అక్కడ చక్రం తిప్పుతారని ప్రచారం జరగడం, దాని వెనుకే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కల్వకుంట్ల తారక రామారావును నియమించడంతో తెలంగాణ రాజకీయాలు ఊపందుకున్నాయి. హరీష్ రావును పక్కన పెడతారని, ఆయన పార్టీకే పరిమితం అవుతారని ఊహాగానాలు వచ్చాయి.

మంత్రివర్గ విస్తరణకు ఏకంగా మూడు నెలలు తీసుకోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఈ నెల 19న జరిగే మంత్రివర్గ విస్తరణలో హరీష్ రావు పేరు ఉండదని కూడా వార్తలు వచ్చాయి. అయితే, పార్టీలో అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు హరీష్ రావుకు మంత్రి పదవి ఖాయమంటున్నారు. ఆయనను దూరం పెట్టి అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోరాదన్నది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆలోచనగా చెబుతున్నారు. అలాగే, అతి త్వరలో లోక్‌ సభకు ఎన్నికలు జరుగనున్నాయి.

అంతవరకూ హరీష్ రావు మంత్రిగా కొనసాగుతారని, ఎన్నికల్లో ఆయన చేత లోక్‌ సభకు పోటీ చేయించి ఢిల్లీ పంపిస్తారని అంటున్నారు. ఒకవేళ కేంద్రంలో కే.సీఆర్ చక్రం తిప్పే ప్రభుత్వం వస్తే హరీష్ రావుకు అక్కడ మంత్రి పదవి ఇప్పించుకుంటారని తాజా ప్రచారం. దీని వల్ల రాష్ట్రంలో తన కుమారుడు కె.తారక రామారావుకు ఇబ్డందులు ఉండవనేది కల్వకుంట్ల వారి ఆలోచనగా చెబుతున్నారు. అటు మేనల్లుడిని, ఇటు కుమారుడ్ని కూడా ఒకే విధంగా చూసుకున్నారనే పేరు కూడా వస్తుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News