విపక్షాలు అధికారపక్షాన్ని పొగడవా?

Update: 2015-10-08 04:10 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి హరీశ్ లాంటి వారు తమ మనసులోని మాట చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో తమను అడ్డుకునే విపక్షాలు లేని నేపథ్యంలో.. తాము చెప్పాల్సింది చెప్పేసి.. సభను వాయిదా వేసేశారు. ఈ నెల పది వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నా.. విపక్షాలు లేని అసెంబ్లీ అక అసెంబ్లీనేనా అనుకున్నారేమో.. చర్చించటానికి విషయాలు లేవని తేల్చేశారు.

ఈ సందర్భంగా విపక్షాల వైఖరిని తీవ్రంగా తిట్టేసిన ముఖ్యమంత్రి.. పనికిమాలిన వాదనతో సభను అడ్డుకుంటున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. సభలో నిరసన చేయటం.. అవసరమైతే వాకౌట్ చేయటం లాంటివి చేయొచ్చంటూ విపక్షాలకున్న హక్కుల గురించి ప్రస్తావించిన ఆయన.. గతంలో పాలించిన కాంగ్రెస్.. తెలుగుదేశం ప్రభుత్వాల చేతకానితనం వల్లే రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీలు రైతుల్ని కోటీశ్వరుల్ని చేస్తే.. మేం చేస్తున్నవి బాగా లేదా అన్న ఆయన.. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అది గత పాలకుల తప్పిదమే తప్పించి.. తమదేమాత్రం కాదని తేల్చేశారు. ‘‘15 నెలల పాలనలో మేమేమన్నా దుర్మార్గం చేశామా? వాళ్ల పాలనలో పాలు పొంగిస్తే.. సాగునీరు పారిస్తే మేమొచ్చి చెడగొట్టామా? అబద్ధం చెప్పిమా నమ్మేలా ఉండాలి’’ అంటూ మండిపడ్డారు.

తెలంగాణ అభివృద్ధి కోసం తాము ఎన్నో కార్యక్రమాల్ని చేపట్టామని.. కానీ.. విపక్షాలకు ఏమీ నచ్చటం లేదని హరీశ్ అనటమే కాదు.. తెలంగాణ అసెంబ్లీ బ్రహ్మాండంగా జరుగుతుందని దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని.. వాటిని చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. బద్ నాం చేసేందుకే వారు బయటకు వెళ్లారని వ్యాఖ్యానించారు.

మిషన్ కాకతీయ.. వాటర్ గ్రిడ్.. విద్యార్థులకు సన్న బియ్యం..యాదగిరి గుట్ట  అభివృద్ధి.. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. రైతుల రుణమాఫీ ఇలా ఏం చేసినా విపక్షాలకునచ్చటం లేదని.. ఏం చేస్తే నచ్చుతుందో అంటూ వ్యాఖ్యానించిన హరీశ్.. తెలంగాణ సర్కారు ఇన్ని పనులు చేస్తున్నా.. ఒక్కసారన్నా మెచ్చుకున్నారా? ఒక్కసారైనా ప్రశంసించారా? అంటూ ప్రశ్నించారు. అంటే.. అధికారపక్షాన్ని విపక్షాలు పొగుడుతూ.. భలే.. భలే.. చేశారని అనలా? మొత్తానికి తమ మనసులోని మాటను చెప్పేసిన తెలంగాణ అధకారపక్షం కోరికను విపక్షాలు మన్నిస్తాయా?
Tags:    

Similar News