హైదరాబాద్ వస్తే పట్టించుకోరు కానీ ఢిల్లీకి..?

Update: 2015-11-05 04:16 GMT
చాలా రాష్ట్రాలకు లేని ప్రత్యేకతలు తెలంగాణ రాష్ట్రానికి చాలానే ఉన్నాయి. చాలా తక్కువ రాష్ట్రాలకు మాత్రమే ఉన్న భారీ రాజధాని నగరం తెలంగాణకు మాత్రమే ఉంది. ఈ కారణంగా.. ఏదో ఒక కార్యక్రమానికి నేతలు.. ప్రముఖులు వచ్చి పోతుంటారు. వ్యక్తిగత అవసరాలు మొదలు..రాజకీయం కోసమో మరో దేని కోసమో రాకపోకలు సాగుతుంటాయి.

రాజధాని నగరానికి వచ్చిన అతిథుల్ని ఆదరించే విషయంలో టీఆర్ ఎస్ సర్కారు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందని ఈ మధ్య ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి లాంటి వారు వస్తేనే లైట్ తీసుకునే తెలంగాణ రాష్ట్ర సర్కారు.. ఇక సీసీఐ ఛైర్మన్ లాంటి వారు హైదరాబాద్ వచ్చినప్పుడు పట్టించుకుంటారా? అంటే పెద్దగా ఉండదని చెప్పాలి.

కేంద్రంలో భాగస్వామి కాకున్నా.. తన నగరానికి వచ్చిన వారిని ఆదరణతో మనసు దోచుకోవటం ద్వారా నెట్ వర్క్ పెంచుకునే వీలుంటుంది. రాజకీయంగా కాస్త ఎడంగా ఉన్నా.. ఆత్మీయతతో దగ్గరతనాన్ని ప్రదర్శించటం ద్వారా రాజకీయాలకు అతీతమైన బంధాన్ని పెంచుకునే వీలుంది. ఇక.. హైదరాబాద్ కు ఉన్న ప్రత్యేకత కారణంగా తరచూ రాకపోకలు ఉంటాయి కాబట్టి.. కాస్త టచ్ లో ఉంటే.. ఏదో రోజు ఏదో విషయానికి ఎంతోకొంత సాయంగా నిలవటం ఖాయం. కానీ.. ఇలాంటివేమీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా కనిపించవు.

తాజాగా మంత్రి హరీశ్ రావు వ్యవహారమే తీసుకోండి. పత్తి కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగా స్పందిస్తుందని చెప్పక తప్పదు. పంట మార్కెట్ లోకి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లేదని అన్నదాతలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారుకు చురుకుపుట్టింది. ఈ విషయం మాట్లాడేందుకు సీసీఐ ఛైర్మన్ ను కలిసేందుకు హరీశ్.. ఢిల్లీకి వెళుతున్నారు. ఒకవైపు పత్తి పంట పొలాల నుంచి మార్కెట్ లోకి బారులు తీరిన సమయంలో ఢిల్లీకి వెళ్లి.. పత్తి కొనుగోలుపై మాట్లాడటం అంటే.. ఎప్పటికయ్యేను?

మరో విషయం ఏమిటంటే.. ఢిల్లీకి వెళ్లి సీసీఐ ఛైర్మన్ ను కలవటానికి వెళుతున్న మంత్రి హరీశ్.. అదే ఛైర్మన్ హైదరాబాద్ వచ్చినప్పుడు పలుకరించే దిక్కు లేని పరిస్థితి. మనకు అవసరమైనప్పుడు పరుగుల పెట్టి వెళ్లటం.. పని పూర్తి చేసుకునేందుకు ప్రయత్నించటం ఎంత వరకు వర్క్ వుట్ అవుతుందో సందేహమే. అదే.. హైదరాబాద్ కు వచ్చే ప్రముఖల విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు తరఫున జాగ్రత్తలు తీసుకుంటే.. ఇలాంటి అపత్కాల సమయంలో అండగా నిలిచే వీలుంది. ఇంటికొచ్చినప్పుడు పట్టించుకోకుండా.. అవసరం వచ్చినప్పుడు వారింటికి వెళ్లి పలుకరిస్తే ప్రయోజనం ఉంటుందా..?
Tags:    

Similar News