హరీశ్ రావుకు బ్యాడ్ టైం మొదలైందా?

Update: 2016-07-27 09:49 GMT
ఒకప్పుడు కేసీఆర్ తరువాత రెండో స్థానంలో ఉన్న ఆయన మేనల్లుడు హరీశ్ మెల్లమెల్లగా ప్రభ కోల్పోతున్నారు. తిరుగులేని నేతగా వర్ధిల్లిన ఆయన కేసీఆర్ తనయుడు కేటీఆర్ రాజకీయ ప్రవేశం తరువాత మసకబారుతున్నారు. పార్టీ పెద్దలు, వారికి అనుకూలంగా ఉన్న నేతలు హరీశ్ కు ప్రాధాన్యం తగ్గించినా ప్రజల్లో ఇంతవరకు ఆయనకు ఎదురే లేదు. కానీ... ఇప్పుడు ఆయన సొంత జిల్లాలో నిర్మిస్తున్న  మల్లన్నసాగర్ ప్రజలను కూడా ఆయనకు దూరం చేసేలా కనిపిస్తోంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఆయన మెడకు గుదిబండలా చుట్టుకుంది.

మల్లన్నసాగర్ భూ సేకరణ సమస్యతో హరీశ్ పూర్తి ఢిపెన్స్‌ లో పడిపోయారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు చెబుతున్నారు. ఎందుకంటే మల్లన్నసాగర్‌ వ్యవహారం అంతకంతకూ ముదురుతుందే కానీ తగ్గడం లేదు. లాఠీఛార్జి భూ నిర్వాసితుల ఆందోళనలకు మరింత ఆజ్యం పోసింది. కానీ హరీశ్‌ రావు మాత్రం ఇదంతా ప్రతిపక్షాల కుట్రగా కొట్టి పారేస్తున్నారు. 8 ముంపు గ్రామాల్లో ఆరు గ్రామాల ప్రజలు భూమలిచ్చేశారని ప్రకటించారు. కానీ ఆదివారం ఐదు గ్రామాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం ఆయన మాట్లల్లో డొల్ల తనాన్ని తెలియజేస్తుంటే.. విపక్షాల బంద్‌ పై ఆయన స్పందన బేలతనాన్ని బయటపెట్టింది. బంద్‌ విఫలమైందని గట్టిగా చెప్పలేకపోయారు హరీశ్‌.

మరోవైపు హరీశ్ సొంత జిల్లాలో మొదలైన ఈ భూసేకరణ గొడవలు ఇప్పుడు ఇతర జిల్లాలకూ పాకడంతో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయనదే బాధ్యత అవుతోంది. ఇతర జిల్లాలకూ గొడవలు పాకడంతో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రభుత్వానికీ ఇబ్బందిగా మారుతోంది. డిండి ఎత్తి పోతల పథకంలో భాగంగా నల్గొండ జిల్లాలో శివన్నగూడెం - గొట్టి మొక్కల  - పెళ్లిపాకల - చర్లగూడెం రిజర్వాయర్ల కింద ఈ గ్రామాలలో భూములు ఇండ్లు కోల్పోతున్న రైతులు తమకు న్యాయం చేయాలంటూ నల్గొండ కలెక్టరేట్ ముట్టడించారు.  మెదక్ - నల్గొండ ఆందోళనలతో టీఆరెస్ ప్రభుత్వానికి తలనొప్పులు తప్పడం లేదు.
Tags:    

Similar News