హ‌రీశ్ టోన్ మారుతోంది ఎందుకు..?

Update: 2016-05-18 06:37 GMT
మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంలో తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్నిచెప్పుకొచ్చారు. తాను ఏపీ ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ దేవినేని ఉమ‌కు ప‌లుమార్లు ఫోన్ చేశాన‌ని.. రాజోలిబండ మ‌ళ్లింపు ప‌థ‌కం గురించి మాట్లాడుకోవ‌టానికి కూర్చుందామ‌ని కోరాన‌ని.. కానీ ఆయ‌న నుంచి ఎలాంటి స్పంద‌న లేద‌ని చెప్పుకొచ్చారు.ఇప్ప‌టివ‌ర‌కూ ఏదైనా ఇష్యూ మీద ఏపీ ముఖ్య‌మంత్రి.. మంత్రులు తెలంగాణ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల కోసం త‌పించ‌టం క‌నిపిస్తుంది. కానీ.. అందుకు భిన్నంగా ఏపీ మంత్రితో భేటీ కోసం తెలంగాణ మంత్రి ఒక‌రు అన్నిసార్లు ప్ర‌య‌త్నించ‌టం కాస్త అనుభ‌వ‌మేన‌ని చెప్పాలి. అయితే.. ఈ వ్య‌వ‌హారంలో తెలంగాణ ప్ర‌యోజ‌నాలు భారీగా ఉన్న‌నేప‌థ్యంలో హ‌రీశ్‌ రావు అతృత‌ను అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలంగాణ ప్ర‌భుత్వంతో త‌న‌కు తాను స‌మావేశ‌మై.. ఇష్యూలు క్లోజ్ చేసేంత ధైర్యం దేవినేని ఉమ చేయ‌లేర‌న్న సంగ‌తి తెలిసిందే. ఒక సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి కూర్చొని మాట్లాడుకోవాలంటే మంత్రుల స్థాయి కంటే ముఖ్య‌మంత్రుల స్థాయే బెట‌ర్‌. విష‌యం ఏదో ఇట్టే తేలిపోతుంది. కానీ.. ఇక్క‌డ ముఖ్య‌మంత్రుల ప్ర‌స్తావ‌న రాకుండా మంత్రుల స్థాయి మీటింగ్ గురించే హ‌రీశ్ త‌ర‌చూ ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం.

తొలుత తాను ఫోన్లు చేస్తే రియాక్ట్ కావ‌టం లేదంటూ అసంతృప్తి వ్య‌క్తం చేసిన హ‌రీశ్‌.. తాజాగా ఈ అంశం మీద నిప్పులు చెరిగినంత ప‌ని చేయ‌ట‌మే కాదు.. హెచ్చ‌రిక త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. క‌ర్ణాట‌క‌తో చ‌ర్చ‌లు జ‌రిపి.. వారికి న‌చ్చ‌జెప్పి.. ఆర్డీఎస్ ప్రాజెక్టు ప‌నుల్ని తాము ఒక కొలిక్కి తీసుకొస్తే ఏపీ పాల‌కులు మాత్రం దానికి మోకాల‌డ్డ‌టం ఏమిట‌న్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన హ‌రీశ్.. త‌మ ప్రాజెక్టుల్ని ఏపీ అడ్డుకుంటే మీకే న‌ష్ట‌మ‌ని ఏపీ స‌ర్కారుపై ఫైర్ అవుతున్నారు.

క‌ర్ణాట‌క‌కు రాసిన లేఖ‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని.. లేక‌పోతే భ‌విష్య‌త్తులో ఏపీకి స‌హ‌క‌రించ‌మంటూ ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చేశారు హ‌రీశ్‌. త‌మ‌కు స‌హ‌కారం అందించ‌క‌పోతే పులిచింత‌ల‌ను నిండ‌నించ‌మ‌ని తేల్చిన హ‌రీశ్‌.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాన ఉసురు పోసుకున్న‌ది చాల్లేదా? అంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన తీరు చూస్తే.. ఆర్డీఎస్ వివాద ప‌రిష్కారం మీద హ‌రీశ్ అండ్ కో పెట్టుకున్న ఆశ ఎంత ఎక్కువ‌న్న విష‌యం ఇట్టే తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అక్ర‌మంగా ఏపీ నీటిని వాడుకుంటున్న తీరును అంకెల‌తో స‌హా చెబుతున్న తీరు ఏపీ స‌ర్కారు ఇరుకున‌ప‌డేలా చేస్తుంద‌న్న మాట వినిపిస్తోంది. స‌హ‌జంగానే తాను న‌మ్మిన వాద‌న‌ను బ‌లంగా వినిపించే హ‌రీశ్ రావు లాంటి నేత ఏదైనా అంశం మీద ఫోక‌స్ పెట్టిన‌ప్పుడు ఏపీ వాద‌న అంతే బ‌లంగా ఉండాల‌న్న మాట వినిపిస్తోంది. లేదంటే.. ఏపీ దోషిగా నిల‌బ‌డ‌క త‌ప్ప‌ద‌ని చెప్పొచ్చు. మొన్న‌టివ‌ర‌కూ తాను ఫోన్లు చేసినా స్పందించ‌టం లేద‌ని మాత్ర‌మే చెప్పిన హ‌రీశ్ ఇప్పుడు అందుకు భిన్నంగా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్న వైనం చూస్తే.. కామ్ గా ఉంటూ ఏపీ తాను చేయాల్సిన ప‌ని చేసుకుంటూ పోతుందా? అన్న సందేహాలు వ్య‌క్తం కాక మాన‌వు.
Tags:    

Similar News