ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర కాదన్న హరీశ్

Update: 2017-01-18 06:41 GMT
ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర మాత్రం కాదన్న సామెత తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు దగ్గర కనిపిస్తుంది. మాటల్లో తియ్యదనాన్ని ప్రదర్శించినా.. చివరకు పని దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎలాంటి ‘స్నేహాలు’ తమ మీద ప్రభావం చూపలేవన్నట్లుగా చేతల్లోచేసి చూపించారని చెప్పాలి. కావాలంటే నాలుగు పొగడ్తలు పొగడటానికి ఏ మాత్రం ప్రాబ్లం లేదన్నట్లుగా ఉండే ఆయన తీరు.. పని విషయానికి వస్తే మాత్రం ప్రాసెస్ ప్రకారమే జరగాలన్న విషయాన్ని తేల్చి చెబుతున్న తీరు ఆసక్తికరమని చెప్పక తప్పదు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అసెంబ్లీకి వచ్చి మంత్రి హరీశ్ ను కలిశారు. ఎస్సారెస్పీ వరద కాల్వ కింద సాగునీటిని విడుదల చేయాలన్న విన్నపాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సారెస్పీలో నీరు ఉన్ననేపథ్యంలో రైతులకు నీటిని విడుదల చేసి పంటను కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ పొన్నంను పొగిడేశారు.

పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన్ను తాము మంచి మిత్రుడిగానే చూస్తామని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన బాగా పోరాడారని.. ఆయన్ను కరీంనగర్ సభలో కేసీఆర్ బాగా పొగిడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికి తాము అదే ధోరణితో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెప్పిన హరీశ్.. అసలు విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాస్త గట్టిగానే వ్యవహరించారని చెప్పాలి.

పొన్నం కోరినట్లుగా ఎస్పారెస్పీ నీరు రైతులకు ఇవ్వలేమని.. ఆ నీరు ఆయకట్టకే సరిపోతుందని.. వరద కాల్వకు ఇవ్వటం సాధ్యం కాదని తేల్చేశారు. ప్రస్తుతం నీళ్లు ఉన్నాయిగా అన్న మాటకు సమాధానమిస్తూ.. ఇప్పుడు నీరు వదిలితే.. చివర్లో నీళ్లు లేనిపక్షంలో నిలిపివేస్తామని.. అప్పుడు ఆందోళనలు చేయనన్న మాట ఇవ్వాలంటూ హరీశ్ తీసిన పాయింట్ కు పొన్నం అదెలా కుదురుతుందని చెప్పారు. మొత్తానికి ప్రత్యర్థిని పొగిడేందుకు సైతం వెనుకాడని హరీశ్.. పని దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎంత ఆచితూచి వ్యవహరిస్తారన్నది తాజా ఉదంతం చూస్తే ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News