హ‌రీశ్ కితాబుఃపార్టీ కోసం కేటీఆర్ గొప్ప కృషి

Update: 2016-02-08 15:31 GMT
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీఆర్ ఎస్ పార్టీ సాధించిన అద్వితీయ విజ‌యం ఎంత ఆశ్చ‌ర్య‌ప‌రిచిందో అదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత-ముఖ్య‌మంత్రి కేసీఆర్ వార‌సుడి ప్ర‌క‌ట‌న క్లారిటీ కూడా అంతే ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సీఎం కేసీఆర్ వార‌సుడు మంత్రి కేటీఆర్ అంటూ కేసీఆర్ కుమార్తె, ఎంపీ కే క‌విత ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో కేటీఆర్‌ కు ప్ర‌స్తుతం ఉన్న శాఖ‌ల‌కు తోడుగా మ‌రో కీల‌క‌మైన శాఖ‌ను క‌ట్ట‌బెట్టారు. దీంతో హ‌రీశ్‌ రావు, మంత్రి కేటీఆర్‌ ల మ‌ధ్య వార‌సుడు ఎవ‌రో స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఈ ప‌రిణామాల‌న్నీ హ‌రీశ్‌ కు పొగ‌పెట్ట‌డంలో భాగ‌మేన‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో తాజాగా హ‌రీశ్‌ రావు స్పందించారు.

నారాయణఖేడ్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్న హ‌రీశ్‌ రావును ఓ మీడియా సంస్థ క‌దిలించింది. ఈ సంద‌ర్భంగా ష‌రామామూలుగా నారాయ‌ణ‌ఖేడ్‌ లో గులాబీ జెండా ఎగరేస్తామని మంత్రి హరీశ్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. గ‌తంలో ఖేడ్‌ లో అస‌లే అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని పేర్కొంటూ ఇపుడు టీఆర్ ఎస్ వల్లే అది సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పారు. టీడీపీ - కాంగ్రెస్‌ ల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని హరీశ్ వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల గురించి ప్ర‌స్తావిస్తూ హైదరాబాద్‌ లో ఉన్న‌వారంతా తెలంగాణ బిడ్డలేనని చెప్పారు.

టీఆర్‌ ఎస్‌ లో మంత్రి కేటీఆర్ కేసీఆర్ వార‌సుడిగా ఖ‌రార‌యింద‌ని, నంబ‌ర్‌ వ‌న్‌ గా ఆయ‌న్ను డిసైడ్ చేయ‌డం మీ ప్రాధాన్యం త‌గ్గ‌డ‌మే కదా అన్న ప్ర‌శ్న‌కు హ‌రీశ్ త‌న‌దైన శైలిలో స్పందించారు. త‌మ పార్టీలో ఉన్న‌ది సీఎం కేసీఆర్ ఒక్క‌రేన‌ని పేర్కొంటూ నెంబర్‌ టూ లేదు, త్రీ అంటూ ఏమి లేదని స్ప‌ష్టం చేశారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్‌ పనితీరు బాగుందని.. పార్టీకి కేటీఆర్‌ చాలా కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. అయితే టీఆర్ ఎస్ నాయ‌కులుగా త‌మ‌కు నెంబర్ల మీద కాకుండా ప్ర‌జా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించామని తెలిపారు. మొత్తంగా వార‌స‌త్వం ఇష్యూకు హ‌రీశ్‌ రావు త‌న‌దైన శైలిలో శుభం కార్డు వేశారు.
Tags:    

Similar News