ఆ న్యూస్ ఒక న్యూసెన్స్ అంటున్న హరీశ్

Update: 2016-01-28 04:36 GMT
తెలంగాణ అధికారపక్షమైన టీఆర్ ఎస్ లో బావా.. బావమరుదుల మధ్య అధిపత్య పోరు నడుస్తుందన్నది జగమెరిగిన సత్యం. అయితే.. తమ మధ్య అలాంటివేమీ లేవని తేల్చిచెప్పటమే కాదు.. ఎప్పుడూ లేని విధంగా ఈ అంశంపై మరింత వివరంగా మాట్లాడారు తెలంగాణ మంత్రి.. కమ్ కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు. కేటీఆర్.. హరీశ్ రావుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందంటుందని పార్టీ వర్గాలే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితుల్లోఆయనీ విషయంపై కాస్తంత వివరంగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా తనకూ.. కేటీఆర్ కు మధ్య అధిపత్య పోరు సాగుతుంటుందన్న విమర్శల్లో నిజం లేదని చెప్పిన హరీశ్.. ఇంకా ఏమన్నారంటే..

‘‘కేటీఆర్ కు..నాకుఅధిపత్య పోరని.. గ్రేటర్ ఎన్నికల్లో నన్ను దూరం పెట్టారన్నది ఒక న్యూసెన్స్. రాజకీయంగా ఎదుర్కోలేక చేస్తున్న చౌకబారు ప్రచారం. మేమంతా ఒక్కటిగా ముందుకు సాగుతున్నాం’’ అంటూ వ్యాఖ్యానించారు. గ్రేటర్.. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఒకేసారి వచ్చాయని.. తమకు రెండు ఎన్నికలూ ముఖ్యమని.. జిల్లా మంత్రిగా తనకు నారాయణఖేడ్ ఉపఎన్నికల బాధ్యతలు పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించారన్నారు.

తనకు నారాయణఖేడ్ బాధ్యతలు.. రాముకు గ్రేటర్ బాధ్యతలు ఇచ్చారన్న హరీశ్.. గ్రేటర్ లో టీఆర్ ఎస్ 90 నుంచి 100 స్థానాల్లో గెలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో నారాయణ్ ఖేడ్ లో తాము 25వేల ఓట్లు మెజార్టీతో గెలుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాటిచ్చానని.. కానీ ప్రజాదరణ చూస్తే 50వేల మెజార్టీ రావటం ఖాయమనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News