పెళ్లి కావాలంటే టీఆరెస్ కు ఓటేయాలంట

Update: 2016-01-23 07:36 GMT
ఎన్నికల ఎత్తుగడల్లో ఆరితేరిపోయిన టీఆరెస్ మంత్రి హరీశ్ రావు తెలంగాణలోని నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతను భుజానికెత్తుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ఇప్పుడే తన ఎలక్షన్ తెలివితేటలను ప్రదర్శించడం ప్రారంభించారు. తన విలక్షణ ఎత్తుగడలతో ప్రతిపక్షాలను చిత్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నారాయణఖేడ్‌ లో ఆయన విచిత్రంగా పెళ్లి సెంటిమెంట్‌ ను ఎత్తుకుని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నారాయణఖేడ్ నియోజకవర్గంలో యువతకు వివాహాలు కావడం లేదని... అందుకు కాంగ్రెస్సే కారణమని ఆయన కొత్త వాదన ఎత్తుకున్నారు. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాగేందుకు నీరు కూడా లేవని… 60 ఏళ్లలో ఏనాడు కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని పట్టించుకోలేదని హరీష్ ఆరోపిస్తున్నారు. తాగేందుకు నీరు లేకపోవడం వల్లే నారాయణఖేడ్‌ పరిధిలోని చాలా గ్రామాల్లో పెళ్లి వయసు వచ్చినా కుర్రాళ్లకు పెళ్లి కావడం లేదని చెబుతున్నారు. ఈ నియోజకవర్గానికి తమ అమ్మాయిలను ఇవ్వడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో కుర్రాళ్లకు పెళ్లి కావడం లేదని... ఈ పాపం కాంగ్రెస్ దేనని ఆయన అంటున్నారు. కాబట్టి మరోసారి కాంగ్రెస్‌ కు ఓటేస్తే ఇక ఎప్పటికీ పెళ్లి కాదంటూ కుర్రకారును ఆలోచనలో పడేస్తున్నారు. తమ ప్రభుత్వం నియోజకవర్గంలోని నీటి సమస్యను తీర్చి యువతకు పెళ్లి సమస్యకు ముగింపు పలుకుతుందని ఆయన చెబుతున్నారు. మరి హరీశ్ పెళ్లి మంత్రాలు ఎంతవరకు ఫలితమిస్తాయో చూడాలి.
Tags:    

Similar News