చైనా బరితెగింపుపై స్పందించిన సీఎం!

Update: 2016-07-27 10:10 GMT
భారతదేశపు మంచితనాన్ని చేతగానితనంగా భావించడంలో పాకిస్థాన్ తో పోటీపడుతోన్న దేశం చైనా. అవకాశం వచ్చినప్పుడల్లా.. తన అసలురంగు బయటపెడుతూ భారత భూభాగంలోకి బలగాలను పంపడం వారికి నిత్యకృత్యంగా మారింది. అయితే గత నెల 13న డ్రాగన్ బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చాయని  కథనాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మరోసారి చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా దృవీకరించింది.

ఈ నెల 19న ఉత్తరాఖండ్‌ లోని చమోలి జిల్లాలోకి చైనా బలగాల చొరబాటు విషయం నిజమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ వెల్లడించారు. చైనా సరిహద్దుల్లో ఉన్న చమోలి జిల్లాలోని బరాహోటి ప్రాంతంలోకి గత నెలలో కూడా చైనా బలగాలు చొరబడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన రావత్.. చైనా బలగాలు భారత్ భూభాగంలోకి వచ్చినప్పటికీ.. కీలకమైన కెనాల్‌ దగ్గరికి చేరలేదని, కొంతవరకూ ఇది మంచి విషయమే అని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తాము భావిస్తున్నామని తెలిపారు. కాగా గతంలో కూడా చైనా చాలాసార్లు ఉత్తరాఖండ్‌ లోకి చొరబడిరావడం అక్కడ "చైనా" అనే బోర్డులు పెట్టడం చేస్తోంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంతో చైనాకు 350 కిలోమీటర్ల సరిహద్దు ఉంది!
Tags:    

Similar News