ఆ మంత్రి చేస్తున్న సాహసం.. తెలుగు నేతల్లో ఎంతమందికి ఉంది?

Update: 2020-11-18 23:30 GMT
ప్రజల కోసం.. వారి బాగు కోసం తమ జీవితాల్ని పణంగా పెడతామని గొప్పలు చెప్పే నేతల మాటలే కానీ.. చేతల్లో చేసి చూపించే వారు చాలా తక్కువగా కనిపిస్తారు. అలాంటి పరిస్థితుల్లో హర్యానాకు చెందిన మంత్రి ఒకరు తీసుకున్న నిర్ణయం విన్నంతనే.. మన దగ్గర కూడా ఇలాంటి మంత్రులు ఉన్నారా? అన్న సందేహం కలుగక మానదు. ఇంతకీ.. హర్యానా మంత్రి చేస్తున్న సాహసం ఏమిటన్న విషయంలోకి వెళితే..

కరోనాకు చెక్ చెప్పేందుకు వివిధ సంస్థలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉండటం తెలిసిందే. దేశీయ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ప్రయోగాలు ఈ నెల 20న (శుక్రవారం) షురూ కానున్నాయి. ఊహించని రీతిలో ఈ క్లినికల్ టెస్టులకు హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్.. తొలి వాలంటీర్ గా తన పేరును నమోదు చేసుకునేందుకు ముందుకు రావటం విశేషం.

ఇదే విషయాన్ని సదరు మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇప్పటికే రెండు దశల్లో క్లినికల్ టెస్టుల్ని నిర్వహించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను మూడో దశకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మంది వాలంటీర్లతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించటానికి భారత్ బయోటెక్ ఏర్పాట్లు చేసింది.

ఈ ట్రయల్స్ లో భాగంగా నాలుగు వారాల వ్యవధిలో రెండు ఇంట్రా మస్కులర్ ఇంజెక్షన్లు ఇవ్వనున్నారు. తొలి రెండు దశల్లోఇప్పటివరకు టీకాలు తీసుకున్న వాలంటీర్లకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకాలేదని చెబుతున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఈ వ్యాక్సిన్ మీద అంచనాలు అంకతంతకూ పెరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటక్.. ముక్కు ద్వారా చుక్కల మందు రూపంలో వ్యాక్సిన్ ఇవ్వాలన్న ఆలోచన కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ సంగతిని పక్కన పెడితే.. హర్యానా ఆరోగ్య మంత్రి తరహాలో క్లినికల్ టెస్టుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఎవరైనా ముందుకు వచ్చే సాహసం చేస్తారంటారా? ఏ మాటకు ఆ మాటే హర్యానా మంత్రిగారి దమ్మే దమ్ము.
Tags:    

Similar News