అరెరే.. బాబు కాళ్లకు దండం పెట్టినా యూజ్ లేదు!

Update: 2019-03-19 06:53 GMT
ఆఖరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్. ఈ దళిత నేత ఇన్నాళ్లూ తెలుగుదేశం వైరి గానే కొనసాగారు. ఇప్పటి నుంచి కాదు.. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన హర్షకుమార్.. ఇన్నేళ్ల ప్రస్థానం అంతా తెలుగుదేశం వైరిగానే కొనసాగింది. కాంగ్రెస్ లో ఉన్న రోజుల్లో… ఈయన ముఖ్యమంత్రి వైఎస్ వైరి వర్గంలో ఒకరిగా కొనసాగినా.. తెలుగుదేశం పార్టీ అనుకూలత మాత్రం లేదు.

గత ఎన్నికల్లో కూడా ఈయన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ తరఫున నిలిచారు. ఆ ఎన్నికల తర్వాత వివిధ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు తీరును విమర్శిస్తూ వచ్చారు. అయితే వైఎస్ వ్యతిరేక అనే ముద్ర ఉండటంతో జగన్ పార్టీలోకి ఈయన చేరలేకపోయారు.

ఇక ఇటీవలే అమలాపురం ఎంపీ రవీంద్రకుమార్ తెలుగుదేశం పార్టీని వీడటంతో అక్కడ అభ్యర్థిని వెదుక్కోవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు. మాజీ స్పీకర్ దివంగత బాలయోగి తనయుడు పేరు వినిపించినా.. బాబు హర్షకుమార్ ను పార్టీలోకి చేర్చుకున్నాడు. దీంతో ఆయనకే టికెట్ ఖరారు అనే ప్రచారం జరిగింది.

అయితే చేర్చుకున్నాకా  చంద్రబాబు నాయుడు ట్విస్ట్ ఇచ్చారు. చేరిక సభలో చంద్రబాబుకు హర్షకుమార్ పాదాభివందనం కూడా చేశాడు. ఒక సీనియర్ నేత అలా బాబు పాదాల మీద పడటం తో సర్వత్రా విస్మయం వ్యక్తం అయ్యింది. ఎంత ఓడిపోయి ఉంటే మాత్రం మరీ ఇలా కాళ్ల మీద పడటం ఏమిటనే చర్చ జరిగింది. దళిత వర్గాలు కూడా ఈ విషయంలో నొచ్చుకున్నాయి.

అవతల జగన్ దళిత నేతలను తన పక్కన కూర్చోబెట్టుకుని అభ్యర్థుల ప్రకటన జాబితాను వారి చేతిలో పెడుతుంటే.. చంద్రబాబు ఇలా దళిత నేతలతో కాళ్లు మొక్కించుకోవడం వివాదం అయ్యింది కూడా. అంత చేసినా.. ఇప్పుడు హర్షకుమార్ కు టికెట్ దక్కకపోవడం విశేషం. తెలుగుదేశంలో చేరినా.. హర్షకుమార్ కు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వలేదు. బాలయోగి తనయుడికే అమలాపురం ఎంపీ టికెట్ ను ఖరారు చేశారు చంద్రబాబు. మరి ఇప్పుడు హర్షకుమార్ పరిస్థితి ఏమిటో!
Tags:    

Similar News