కొత్త వైరస్ పై కేంద్రం అలర్ట్ గానే ఉంది ... భయపడకండి !

Update: 2020-12-21 14:30 GMT
బ్రిటన్ లో కొత్తగా విజృంభిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ పై ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. అయితే, ఈ కొత్త రకం కరోనా ‌విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. యూకేలోని కొత్త ర‌కం వైర‌స్‌ పై శాస్త్ర‌వేత్త‌లు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఊహాజ‌నిత ప‌రిస్థితులు, వివ‌ర‌ణ‌లు చూసి భ‌య‌ప‌డిపోవ‌ద్దు. ఇక్క‌డ మ‌రీ అంత ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని నేను భావిస్తున్నాను.

అయితే మన సైంటిస్టులు మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ఈ కొత్త రకం వైర‌స్ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు అని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు. యూకేలో వెలుగుచూసిన ఈ కొత్త ర‌కం వైర‌స్‌పై చ‌ర్చించ‌డానికే సోమ‌వారం జాయింట్ మానిట‌రింగ్ గ్రూప్‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. బ్రిట‌న్‌లో క‌నిపించిన ఈ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ అంత‌కుముందు వైర‌స్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో లండ‌న్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో మ‌రోసారి లాక్‌ డౌన్ విధించారు. ప‌రిస్థితి చేయి దాటిపోయింద‌ని అక్క‌డి ఆరోగ్య మంత్రి హాంకాక్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

కరోనా మహమ్మారిపై భారత ప్రజలు చేసిన పోరాటం మనదేశ సహనశక్తికి నిదర్శనంగా నిలిచింది. కరోనాను ఎదుర్కొనే విషయంలో భారత్‌ మెరుగైన పనితీరును కనబరిచింది. ఇదంతా మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైంది అని మంత్రి హర్షవర్ధన్ అన్నారు. మరోవైపు.. యూకే నుంచి వచ్చే విమానాలపై భారత్ నిషేధం విధించింది. డిసెంబర్ 31 వరకు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది.
Tags:    

Similar News