బండ్ల బాట‌లో అలీ!

Update: 2019-01-07 04:46 GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్ - అలీ మ‌ధ్య స్నేహం గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌క్క‌ర్లేదు. ఆ ఇద్ద‌రు అత్యంత స‌న్నిహితులు. ఒక‌రి పై ఒక‌రికి విప‌రీత‌మైన అభిమానం ఉంది. అందుకే ఇటీవ‌ల వైసీపీ అధినేత జ‌గ‌న్ ను అలీ క‌ల‌వ‌డం ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ప‌వ‌న్ కు హ్యాండిచ్చి అలీ వైసీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఆ ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో, వార్తాసంస్థ‌ల్లో హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌గానే అలీ ఇటు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, త‌న ఆప్త‌మిత్రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనూ భేటీ అయ్యాడు. త‌ద్వారా పెద్ద క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేశాడు. ఈ నెల 9వ తేదీన అలీ వైసీపీలో చేర‌డం ఖాయ‌మ‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా మ‌ళ్లీ చంద్ర‌బాబు - ప‌వ‌న్ ల‌తో విడివిడిగా ఆయ‌న ఎందుకు భేటీ అయ్యాడో తెలియ‌క జ‌నం, రాజ‌కీయ విశ్లేష‌కులు త‌ల‌లు బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నారు.

ప‌వ‌న్ తో భేటీ అనంత‌రం అలీ మీడియా ప్ర‌తినిధుల‌తో ముక్త‌స‌రిగా రెండు ముక్క‌లు మాట్లాడారు. కొత్త సంవ‌త్స‌రం వ‌చ్చాక తాను ప‌వ‌న్ ను క‌లవ‌లేద‌ని - అందుకే ఇప్పుడు వ‌చ్చి న్యూ ఇయ‌ర్ విషెస్ చెప్పాన‌ని చెప్పారు. త‌మ భేటీలో ర‌హ‌స్య మంత‌నాలేవీ జ‌ర‌గ‌న‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న మాట‌ల‌ను రాజ‌కీయ విశ్లేష‌కులు మాత్రం విశ్వ‌సించ‌డం లేదు. జ‌గ‌న్ - చంద్ర‌బాబుల‌తో భేటీ అవ్వ‌డం, ఆ వెంట‌నే వ‌చ్చి ప‌వ‌న్ ను అలీ క‌ల‌వ‌డం వెనుక పెద్ద మ‌త‌ల‌బేదో త‌ప్ప‌కుండా ఉండి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అలీ వైసీపీలో చేర‌బోర‌ని జ‌న‌సేన అభిమానులు చెప్తున్నారు. రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఆసక్తి ఉంటే ఆయ‌న క‌చ్చితంగా జ‌న‌సేన‌లోనే చేరుతార‌ని విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు.
మ‌రోవైపు - అలీ వ్య‌వ‌హారం బండ్ల గ‌ణేశ్ ఎపిసోడ్ ను గుర్తుకుచేస్తోంద‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

బండ్ల గ‌ణేశ్ కూడా ప‌వ‌న్ కు స‌న్నిహితుడు. ప‌వ‌న్ ను దేవుడిగా, త‌న‌ను ఆయ‌న భ‌క్తుడిగా బండ్ల ఎప్పుడూ చెప్పుకునేవాడు. జ‌న‌సేన ఆవిర్భావం త‌ర్వాత ప‌వ‌న్ కు మ‌ద్ద‌తుగా ఆయ‌న చాలాసార్లు మాట్లాడాడు. దీంతో బండ్ల జ‌న‌సేన‌లో చేర‌డం ఖాయ‌మ‌ని అంతా భావించారు. అంచ‌నాల‌న్నింటినీ త‌ల‌కిందులు చూస్తే బండ్ల నేరుగా రాహుల్ గాంధీ ద‌గ్గ‌రికి వెళ్లి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. ఆ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డా.. ఇప్పుడు పార్టీ అధికార ప్ర‌తినిధిగా ఉన్నారు. బండ్ల లేక‌పోవ‌డం జ‌న‌సేన‌కు మంచిదేన‌ని ప‌లువురు చెప్తుంటారు. అయితే అది వేరే విష‌యం. స‌న్నిహితుడే ప‌వ‌న్ ను కాద‌ని వేరే పార్టీలో చేర‌డం మంచి ప‌రిణామం కాదు. అలాంటి విష‌యాలు ప‌వ‌న్ గురించి ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలను తీసుకెళ్తాయి. ఇప్పుడు అలీ విష‌యంలోనూ అదే జ‌రుగుతుందేమోన‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. అందుకే అలీ వైసీపీలో చేర‌కుండా జ‌న‌సేన ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని మ‌రికొంద‌రు చెప్తున్నారు.



Full View

Tags:    

Similar News