బాబుకు పీకే పై ఆశ చావ‌లేదు!

Update: 2019-01-02 04:33 GMT
గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఓ వైపు బీజేపీతో పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భంజ‌నం ముందు నిల‌వ‌లేమ‌న్న భ‌యంతో టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు లెక్క‌లేన‌న్ని వాగ్దానాలు ఇచ్చారు. అక్క‌డికీ గెలుపు పై న‌మ్మ‌కం కుద‌ర‌క‌... అప్పుడ‌ప్పుడే పురుడు పోసుకున్న జ‌న‌సేన‌తోనూ పొత్తు కుదుర్చుకున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌భావం చూపే ప్రాంతాల‌ను ప‌క్కాగా గుర్తించి మ‌రీ... ఆ ప్రాంతాల్లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తో ప్ర‌చారం చేయించారు. మొత్తంగా చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా చంద్ర‌బాబు అధికార ప‌గ్గాలు చేప‌ట్టారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం కార‌ణంగా ఆయ‌న సామాజిక వ‌ర్గం ఓట‌ర్లతో పాటు త‌న అభిమానులు కూడా టీడీపీ అనుకూలంగా ఓటేయ‌డంతో టీడీపీ గ‌ట్టెక్కింది. మొత్తంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను తురుపు ముక్క‌గా వినియోగించుకున్న చంద్ర‌బాబు... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత నాలుగేళ్ల పాటు బీజేపీ, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ల‌తో క‌లిసే చంద్ర‌బాబు ముందుకు సాగారు. అయితే ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా ఏడాది స‌మ‌యం ఉంద‌న‌గా... తానే వ‌ద్దన్న‌ ప్ర‌త్యేక హోదాను మోదీ స‌ర్కారు ప్ర‌క‌టించ‌లేద‌న్న సాకును చూపిన చంద్రబాబు బీజేపీకి క‌టీఫ్ చెప్పారు. ఆ త‌ర్వాత మోదీని గ‌ద్దెదింప‌డ‌మే ల‌క్ష్య‌మంటూ నిత్యం బీజేపీ పై త‌న‌దైన శైలిలో ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు.

అయితే బీజేపీకి చంద్ర‌బాబు క‌టీఫ్ చెప్ప‌డానికి కాస్తంత ముందుగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌... టీడీపీకి భారీ ఝ‌ల‌క్కిచ్చారు. గుంటూరు కేంద్రంగా జ‌రిగిన జ‌న‌సేన స‌భ‌లో అనూహ్యంగా చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు గుప్పించిన ప‌వ‌న్‌... టీడీపీ ప్ర‌భుత్వం అవినీతి పాల‌న కొన‌సాగిస్తోంద‌ని ధ్వజ‌మెత్తారు. పాలిటిక్స్‌ లో సీనియ‌ర్‌ నంటూ చెప్పుకుంటున్న చంద్ర‌బాబు... ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి మంచి పాల‌న అందిస్తార‌ని, రాష్ట్రాన్ని ఆర్థిక ఇక్క‌ట్ల నుంచి గ‌ట్టెక్కిస్తార‌న్న భావ‌న‌తోనే టీడీపీకి మ‌ద్ద‌తుగా నిలిచాన‌ని ప్ర‌క‌టించారు. అయితే నాలుగేళ్ల పాటు వేచి చూసినా కూడా తాను అనుకున్న త‌ర‌హా పాల‌న రాక‌పోగా.. చంద్ర‌బాబు అండ్ కో అవినీతి పాల‌న‌ను తారాస్థాయికి తీసుకెళ్లార‌ని దుమ్మెత్తిపోశారు. అయితే ఏమాత్రం ముంద‌స్తు స‌మాచారం లేకుండానే ఉన్న‌ప‌ళంగా ప‌వ‌న్ యూట‌ర్న్ తీసుకోవ‌డంతో చంద్ర‌బాబుతో పాటు టీడీపీ నేత‌లు షాక్ తిన్నారు. అయినా కూడా కొంత మేర ఓపిక ప‌డ‌దామ‌ని పార్టీ శ్రేణుల‌కు చెప్పిన చంద్ర‌బాబు... ప‌వ‌న్‌ పై విరుచుకుప‌డే వ్య‌వ‌హారానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే ప‌వ‌న్ ఎందుకు త‌మ‌ను విమ‌ర్శిస్తున్నారో తెలియ‌దంటూ కొంత‌కాలం సుతిమెత్త‌గానే  విమర్శ‌లు గుప్పించిన చంద్ర‌బాబు... ఇటీవ‌లి కాలంలో జ‌గ‌న్ లాగే ప‌వ‌న్ కూడా మోదీతో క‌లిసిపోయారంటూ కొత్త పొత్తుల‌ను ప్ర‌స్తావించ‌డం మొద‌లెట్టారు.

ఇంత జ‌రిగినా... ప‌వ‌న్ లేకుంటే త‌న‌కు ఇబ్బందేన‌న్న వాస్త‌వాన్ని గ‌మ‌నించిన చంద్ర‌బాబు... వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ప‌వ‌న్ తో పొత్తు పెట్టుకునేందుకే వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్లుగా కొంత‌కాలం నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వార్త‌ల‌కు బ‌లం చేకూరుస్తున్న‌ట్టుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యం పై చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న పాల‌న‌ పై ప‌దో శ్వేత‌ప‌త్రాన్ని విడుద‌ల చేసిన సంద‌ర్భంగా... మీడియా నుంచి ఎదురైన ఓ ప్ర‌శ్న‌కు స్పందించిన చంద్ర‌బాబు... పవ‌న్ తో క‌లిసే ఎన్నిక‌ల‌కు దిగ‌నున్న‌ట్లుగా ప‌రోక్ష సంకేతాలు ఇచ్చారు. చంద్ర‌బాబుకు మీడియా నుంచి ఎదురైన ప్ర‌శ్న‌, దానికి బాబు స్పందించిన తీరు ఎలా సాగిందంటే... *భవిష్యత్ లో పవన్ కల్యాణ్ తో మీరు కలుస్తారా?* అని ఓ మీడియా ప్ర‌తినిధి  ప్రశ్నించగా.. ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం చెప్పనంటూ చంద్రబాబు చిరునవ్వులు చిందించారు. తాను పవన్‌ కల్యాణ్‌ తో కలిస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఇబ్బంది ఏంటని కూడా చంద్ర‌బాబు ఎదురు ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేస్తానంటే జగన్ కు ఎందుకు భయమని ప్రశ్నించారు. మొత్తంగా ప‌వ‌న్‌తో క‌లుస్తారా? అన్న ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం చెప్పేందుకు స‌సేమిరా అన్న చంద్ర‌బాబు... ప‌వ‌న్ తో పోటీ లేద‌ని చెప్ప‌క‌పోగా.. ప‌వ‌న్ తో తాము క‌లిస్తే వైసీపీకి భ‌య‌మెందుకంటూ అర్థం లేని లాజిక్ తీశారు. ఈ లాజిక్‌ను బ‌ట్టి చూస్తే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ తో పొత్తుకు చంద్ర‌బాబు త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్టుగా ఉంద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.
   



Full View

Tags:    

Similar News