వాక్సిన్ లకు మోడీ ఇంకా డబ్బులు ఇవ్వలేదా?

Update: 2021-04-22 05:30 GMT
మోడీ సార్.. అంతన్నాడు.. ఇంతన్నాడు.. వేల కోట్ల రిలీజ్ అన్నాడు.. రూ.4 వేల కోట్లు రిలీజ్ చేస్తున్నట్టు చెప్పాడు.. దేశ ప్రజలకు వేగంగా టీకాలన్నాడు.. అది చూసి ఆ టీకా తయారీదారులు సంబరపడ్డారు. ప్రజలు తమకు టీకాలొస్తాయని సంతోషపడ్డారు.. కానీ.. చివరకు తేలింది ఏంటంటే.. టీకాల కోసం మోడీ సార్ రూపాయి విదిల్చలేదని.. తయారీ కంపెనీలకు ఒక్క నయాపైసా కూడా కేటాయించలేదని.. దీంతో టీకాల తయారీకి నిధులు లేక తయారీ సంస్థలు నానా అగచాట్లు పడుతున్నట్టు తేలింది.

దేశంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరమ్ ఇన్ స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా తాజాగా బాంబు పేల్చారు. కేంద్రం తమ సీరం సంస్థకు టీకాల తయారీ కోసం మంజూరు చేసిన రూ.3వేల కోట్లు ఇంకా రాలేదన్నారు. అవి వచ్చే లోపు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని టీకా ఉత్పత్తిని వేగవంతం చేస్తామని తెలిపారు.  దీన్ని బట్టి మోడీ ప్రభుత్వం టీకాల కోసం సీరం, భారత్ బయోటెక్ లకు రూ.4వేల కోట్లు కేటాయించినట్టు చేసిన ప్రకటన ఒక కట్టుకథ అని తేలిపోయింది. అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. అప్పటిదాకా ఆగితే టీకాల తయారీ ఆలస్యం అవుతుంది. అందుకే బ్యాంకుల్లో అప్పు చేసి మరీ సీరం సంస్థ ఉత్పత్తికి నడుం బిగించింది.

సీరం సంస్థ తయారు చేస్తున్న కోవిషీల్డ్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి టీకా ఇవ్వనున్నారని.. ఈ నేపథ్యంలో జూలై నాటికి నెలకు 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేయగలమని వెల్లడించారు.

దీన్ని బట్టి మోడీ సార్ పైకి మాటలు చెబుతూ టీకా తయారీ సంస్థలను ప్రోత్సహించడం లేదని.. నిధుల పేరిట కట్టుకథ చెప్పినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కరోనా కల్లోలం వేళ నిధులు విడుదల చేసి దేశ ప్రజలకు టీకాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News