బీజేపీ ప‌త‌నం ప్రారంభ‌మైందా?

Update: 2021-05-01 17:30 GMT
కేంద్రంలో వ‌రుస‌గా రెండు సార్లు అధికారం చేప‌ట్టిన బీజేపీ.. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌నుల కంటే.. రాజ‌కీయంగా త‌న‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌నుల‌కే ప్రాధాన్య‌మిచ్చింద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. పౌర‌స‌త్వ చ‌ట్టం, 370 ఆర్టిక‌ల్ వంటి వివాదాస్ప‌ద అంశాల‌ను ఎత్తుకొని.. త‌న ప‌నిత‌నం మీద ప్ర‌జ‌ల దృష్టి ప‌డ‌కుండా చూసుకుంద‌ని చెబుతారు.

ఇక‌, ఇటీవ‌ల‌ ప్ర‌భుత్వ రంగం మొత్తాన్ని అమ్మేయ‌డ‌మే త‌మ లక్ష్య‌మంటూ.. బాహాటంగా ప్ర‌క‌టించుకున్న ప‌రిస్థితి. అటు.. వివిధ రాష్ట్రాల్లో ప్ర‌జాతీర్పున‌కు విరుద్ధంగా అధికారాన్ని చేప‌ట్ట‌డం వంటి చ‌ర్య‌ల‌కు సిద్ధ‌ప‌డింది. ఇవ‌న్నీ ఒకెత్త‌యితే.. క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తూ.. వేలాది మంది ప్రాణాలు బ‌లిగొంటుంటే.. కేంద్ర కేబినెట్ మొత్తం బెంగాల్ లో కూర్చున్న వ్య‌వ‌హారంపై దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. చివ‌ర‌కు సుప్రీం కోర్టు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన ప‌రిస్థితి. ఇలాంటి ప‌నుల‌తో బీజేపీ ప్ర‌భ మ‌స‌క‌బారుతోందా? అనే సందేహాలు చాలా కాలంగా వ్య‌క్త‌మ‌వుతుండ‌గా.. తాజాగా.. నిరూప‌ణ‌లు కూడా వ‌చ్చేయ‌డం గ‌మ‌నార్హం.

క‌ర్నాట‌క‌లో బీజేపీ అధికారంలో ఉంది. అక్క‌డ ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగాయి. స‌హ‌జంగా ఏ రాష్ట్రంలోనైనా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార పార్టీదే హ‌వా సాగుతుంది. అలాంటిది.. క‌ర్నాట‌క‌లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవ‌డం ఆ పార్టీ ప‌రిస్థితిని తేట‌తెల్లం చేస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

ఆ రాష్ట్రంలో బ‌ళ్లారి కార్పొరేష‌న్ స‌హా ఐదు న‌గ‌ర స‌భ‌ల‌కు, రెండు పుర స‌భ‌ల‌కు, రెండు ప‌ట్ట‌ణ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. శుక్ర‌వారం ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాలు బీజేపీకి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చాయి. బ‌ళ్లారి కార్పొరేష‌న్ తోపాటు మూడు న‌గ‌ర స‌భ‌లు, రెండు ప‌ట్ట‌ణ పంచాయ‌తీలు, ఒక పుర‌స‌భ స్థానాల‌ను కాంగ్రెస్ గెలుచుకొని తిరుగులేని ఆధిప‌త్యం చాటుకుంది. మ‌రో న‌గ‌ర‌, పుర‌స‌భ‌ను జ‌న‌తాద‌ళ్ కైవ‌సం చేసుకుంది. కేవ‌లం ఒకే ఒక న‌గ‌ర స‌భ‌లో అధికార‌ బీజేపీ గెలిచింది.

క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ కూట‌మిలో చిచ్చుపెట్టి బీజేపీ అధికారం సాధించింద‌న్న‌ది అందరికీ తెలిసిందే. అందువ‌ల్లే.. ప్ర‌జ‌లు ఇలాంటి తీర్పు ఇచ్చార‌ని చెబుతున్నారు. భ‌విష్య‌త్ లో సంభ‌వించ‌బోయే రాజ‌కీయ పెనుమార్పుల‌కు ఈ ఫ‌లితాలే నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. రేపు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ ఫ‌లితాలు రాబోతున్నాయి. ఆ ఫ‌లితాల‌ను బ‌ట్టి ఒక అంచ‌నాకు వ‌చ్చేయొచ్చ‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News