బీజేపీ మార్క్ పాలన మొదలైందా ?

Update: 2022-08-15 05:04 GMT
మహారాష్ట్రలో బీజేపీ మార్క్ పాలన మొదలైనట్లే ఉంది. ఏక్ నాథ్ షిండే పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి. ఎందుకంటే ప్రభుత్వంలో షిండే వర్గం మైనారిటీ అన్న విషయం అందరికీ తెలిసిందే. శివసేనలోని షిండే నాయకత్వంలోని  చీలికవర్గం+ బీజేపీ 106 మంది ఎంఎల్ఏలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే బీజేపీ కూడా  ప్రభుత్వంలో చేరిందో అప్పుడే అర్ధమైపోయింది షిండే కేవలం బొమ్మ మాత్రమే అని.

దానికి తగ్గట్లే దాదాపు 40 రోజులు అసలు మంత్రివర్గాన్నే ఏర్పాటు చేయలేకపోయారు. తీరా మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత శాఖలు కేటాయింపు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎంతో కీలకమైన హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు రెండు డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్నారు.

నిజానికి రెండు కీలకమైన శాఖలను ఒకే మంత్రికి ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వరు. అలాంటిది ఇపుడు ఫడ్నవీస్ రెండింటిని తీసుకున్నారంటే సీఎంతో సంబంధం లేకుండా తానే కేటాయించేసుకున్నట్లు అర్ధమవుతోంది.

ఏ ప్రభుత్వంలో అయినా హోంశాఖ ఎంతటి ప్రాధాన్యత కలిగుంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆ శాఖను ముఖ్యమంత్రి తనకు అత్యంత సన్నిహితులకే కేటాయించుకుంటారు. శాంతి భద్రతలు సీఎం తనవద్దే ఉంచుకున్నా హోంశాఖను మాత్రం సన్నిహితులకే అప్పగిస్తారు.

ఇక్కడ షిండే, దేవేంద్రుడు ఏమీ సన్నిహితులు కారు. పైగా మొన్నటి వరకు బద్ధ విరోధమున్న పార్టీలకు ప్రతినిధులే. ఏదో కాలమహిమ వల్ల శివసేన చీలికవర్గం+బీజేపీ కలిశాయి. అంతమాత్రాన హోంశాఖతో పాటు ఆర్ధిక శాఖను కూడా బీజేపీకి ఇవ్వాల్సిన అవసరం లేదు.

అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే శాఖల కేటాయింపులో షిండే ఛాయిస్ ఏమీ లేనట్లే ఉంది. తమకు కావాల్సిన ముఖ్యమైన శాఖల్లో చాలావరకు బీజేపీ తీసేసుకుని మిగిలిన శాఖలను మాత్రమే షిండే వర్గానికి ఇచ్చింది. చేసేదిలేక షిండే వర్గం కూడా బీజేపీ పడేసిన శాఖలతోనే సంతృప్తి చెందాల్సిన పరిస్దితిలో ఉంది. మొత్తానికి తమకు దక్కిన శాఖలు, బీజేపీ డామినేషన్, ఇచ్చిన హామీలను తప్పటం చూస్తుంటే  తొందరలోనే షిండేకి షాక్ తప్పేట్లు లేదు.
Tags:    

Similar News