ఈ నలుగురికీ కొత్తగా మంత్రి పదవులు దక్కినట్లేనా?

Update: 2018-12-12 08:21 GMT
రేపు మధ్యాహ్నం కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదిరింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేబినెట్లో ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే అంచనాలు మొదలయ్యాయి. గత కేబినెట్లోని నలుగురు మంత్రులు ఓడిపోవడంతో కనీసం నలుగురు కొత్తవారు మంత్రివర్గంలో చోటు సంపాదిస్తారన్నది గ్యారంటీ. దీంతో కొత్తగా మంత్రులు కానున్న నలుగురు ఎవరన్నది చర్చనీయమవుతోంది. ఆ అవకాశాలు ఎవరికి బలంగా ఉన్నాయో చూద్దాం.
    
కేసీఆర్ గత కేబినెట్లోని జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకరరావుకు బెర్తు గ్యారంటీ అని తెలుస్తోంది. పాలకుర్తి నుంచి గెలిచిన ఎర్రబెల్లి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన తరువాత మంత్రి పదవి ఆశించారు. కానీ, ఆయనకు అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఆయనకు పదవి గ్యారంటీ అని సమాచారం.

నిరంజన్ రెడ్డి
గత కేబినెట్లోనే బెర్తు గ్యారంటీ అనుకున్న నేత. కానీ, 2014లో ఓడిపోవడంతో అవకాశం పోయింది. ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా పదవి పొందారు. అయితే, ఈసారి భారీ మెజారిటీతో వనపర్తిలో గెలిచిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి పదవి గ్యారంటీ అని తెలుస్తోంది. కేసీఆర్ నిన్నటి కేబినెట్లోని రెడ్డి సామాజిక వర్గ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ సామాజికవర్గ కోటాలో నిరంజన్ రెడ్డికి బెర్తు గ్యారంటీ అని తెలుస్తోంది.

పువ్వాడ అజయ్ కుమార్
ఇక ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల ఓడిపోయారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. ఖమ్మం స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ గెలిచారు. ఆ జిల్లాలో టీడీపీ రెండు సీట్లు గెలిచింది. పువ్వాడ, తుమ్మలది ఒకే సామాజికవర్గం. ఈ అన్ని లెక్కలతో పువ్వాడ అజయ్ కుమార్‌కు చాన్సు ఉండొచ్చు.

రెడ్యానాయక్..
ఇక ములుగు నుంచి మంత్రి ఆజ్మీరా చందూలాల్ ఓడిపోయారు. ఆయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన సీనియర్ లీడర్, మాజీ మంత్రి రెడ్యానాయక్‌కు చాన్సు ఇవ్వొచ్చు. రెడ్యానాయక్ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే. ఆయన డోర్నకల్ నుంచి గెలిచారు.

* వీరితో పాటు మహిళా కోటాలో పద్మాదేవేందర్ రెడ్డికి అవకాశం ఉండొచ్చు.
* ధర్మపురి నుంచి గెలిచిన సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్‌కూ అవకాశం ఉంది. గతసారే కొప్పులకు అవకాశం ఉంటుందని భావించారు. కానీ.. రాలేదు. కొప్పులకు అప్పట్లో కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా చెబుతారు. ఆ నేపథ్యంలో ఆయనకూ అవకాశం రావొచ్చన్న అంచనాలున్నాయి. కానీ.. ఆయన ఈసారి చాలా తక్కువ మెజారిటీతో గెలవడంతో ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News