నీ ఫోక‌స్ క్రికెట్ నుంచి.. భార్య‌ మీద‌కు మ‌ళ్లిందా?

Update: 2021-07-01 17:30 GMT
'క్రికెట్ ఫ్యాన్స్ నందు.. ఇండియా ఫ్యాన్స్ వేర‌యా' అని ఓ సామెత‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అవును మ‌రి.. ఆనందం వ‌చ్చినా ఆపుకోలేరు, ఆవేద‌న వ‌చ్చినా త‌ట్టుకోలేరు. గెలుపు జెండా ఎగ‌రేస్తే బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారు.. ఓట‌మికి కార‌ణ‌మైతే.. ఖ‌ర్మ ర‌థంపై ఊరేగిస్తారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు కావాల్సిన‌న్ని సాక్ష్యాలున్నాయి. ఇదంతా.. ఇప్పుడెందుకు అంటారా? టీమిండియా ఫ్యాన్స్ బుమ్రావెంట పడ్డారు మరి!

మొన్న‌టి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. టెస్టు క్రికెట్ చరిత్ర‌లోనే మొద‌టిసారి జ‌రిగిన ప్ర‌పంచ క‌ప్‌. అలాంటి క‌ప్పును చేజేతులా జార‌విడుచుకున్నార‌ని ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. దీంతో.. శూల శోధ‌న చేస్తూ.. దొరికిన వారిని దొరికిన‌ట్టు సోష‌ల్ మీడియాలో వాయించేస్తున్నారు.

ఈ ఫైన‌ల్ మ్యాచ్ లో టీమిండియా స్పీడ్ స్ట‌ర్ బుమ్రా ప్ర‌ద‌ర్శ‌న మ‌రీ పేల‌వంగా ఉంది. ఇషాంత్ వ‌ర్మ‌, ష‌మీ రెండు ఇన్నింగ్స్ ల‌లో క‌లిపి చెరో ఏడు వికెట్లు ప‌డ‌గొట్టారు. కానీ.. టాప్ పేస‌ర్ గా ఉన్న బుమ్రా మాత్రం ఒక్క‌టంటే ఒక్క వికెట్ కూడా తీయ‌లేదు. లో స్కోర్ మ్యాచ్ ను కాపాడ‌డంలో బౌలింగ్ విభాగం విఫ‌ల‌మైంద‌ని ఫ్యాన్స్ ఆగ్ర‌హంగా ఉన్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో.. త‌న స‌తీమ‌ణితో క‌లిసి న‌వ్వులు చిందిస్తున్న ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు బుమ్రా. ఇంకేముందీ? స‌రిగ్గా స‌మ‌యానికి దొరికిపోయాడు. మ్యాచ్ లో వికెట్లు తీయ‌వుగానీ.. సోష‌ల్ మీడియాలో ఫొటోలు పెడుతున్నావా? అని సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. పెళ్లైన కానుంచి ఫొటోల మీద ఫోక‌స్ పెరిగింది.. క్రికెట్ మీద త‌గ్గిందా? అంటూ కామెంట్ చేస్తున్నారు.
Tags:    

Similar News