అమెరికాలో జాత్య‌హంకార దాడి!..కోమాలో మ‌న బాలిక‌!

Update: 2019-05-07 16:38 GMT
అగ్ర‌రాజ్యం అమెరికాలో జాత్య‌హంకార దాడుల‌కు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అమెరిక‌న్ల‌లా క‌నిపించ‌క‌పోతే చాలు... దాడులు జ‌రిగిపోతున్నాయి. ఈ త‌ర‌హాలోనే ఇటీవ‌ల జ‌రిగిన ఓ దాడిలో అక్క‌డి ఓ శ్వేత జాతీయుడు జ‌రిపిన దాడిలో మ‌న దేశానికి చెందిన ఓ కుటుంబం ప‌రిస్థితి తీవ్ర ప్ర‌మాదంలో పడింది. కాలిఫోర్నియాలో జ‌రిగిన ఈ దాడిలో ఎన్నారై ఫ్యామిలీలోని తండ్రీకొడుకులకు స్వ‌ల్ప గాయాలు కాగా... ఆ కుటుంబానికి చెందిన 13 ఏళ్ల బాలిక మాత్రం తీవ్రంగా గాయ‌ప‌డింది. అంతేకాకుండా ఏకంగా కోమాలోకి వెళ్లిపోయింది. స‌ద‌రు బాలిక‌ను ఆ కోమా నుంచి బ‌య‌ట‌కు ర‌ప్పించ‌డంతో పాటు బ్ర‌తికించుకోవాలంటే... ఏకంగా 5 ల‌క్ష‌ల‌ డాల‌ర్లు కావాల‌ట‌. అంత ఆర్థిక స్తోమ‌త లేని ఆ కుటుంబానికి ఈ వార్త షాక్ ఇచ్చేసింది.

అయితే అక్క‌డున్న మ‌నోళ్లంతా విష‌యం తెలుసుకుని అంతా ఏక‌మై... బాధిత కుటుంబానికి అండ‌గా నిలిచారు. గోఫండ్ మీ ద్వారా బాలిక కోసం విరాళాల‌కు పిలుపు ఇవ్వ‌గా... బాలిక ప‌రిస్థితిని చూసి చ‌లించిపోయిన మ‌నోళ్లంతా కేవ‌లం ఏడేంటే ఏడు రోజుల్లో ఆ బాలిక చికిత్స‌కు అవ‌స‌రం అయిన 5 ల‌క్ష‌ల‌ డాల‌ర్ల కంటే మ‌రో ల‌క్ష‌ డాల‌ర్ల‌ను అద‌నంగా మొత్తంగా 6 ల‌క్ష‌ల‌ డాల‌ర్ల‌ను విరాళాలుగా అంద‌జేశారు. ఇంత‌లా కొండంత అండ దొర‌క‌డంతో ఇప్పుడు బాధిత కుటుంబం కాస్తంత కుదుట ప‌డింది. బాలిక కూడా త్వ‌ర‌లోనే కోలుకుని ఇంటికి రానుంది.

ఆస‌క్తిగొలిపిన ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే... కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న‌ ఇండో అమెరికన్ బాలిక‌ ధ్రితి(13) గత నెల 23న తన కుటుబంతో కలిసిన బయటకు వెళ్తోంది. అయితే వీరిని ముస్లింలుగా భావించిన ఓ జాత్యహంకారి.. వారిని చంపేందుకు ప్రయత్నించాడు. కావాలనే త‌న కారుతో వారిని ఢీకొట్టాడు. ఈ దాడిలో ధ్రితి తీవ్రంగా గాయపడగా.. ఆమె తండ్రి రాజేశ్ నారాయ‌ణ్‌, సోదరుడు ప్ర‌కార్ ల‌కు స్వ‌ల్ప‌ గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి చేర్చారు. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ధ్రితి కోమాలోకి వెళ్లింది. ఆమెకు వైద్యం చేయడానికి 5 లక్షల అమెరికన్‌ డాలర్లు(రూ.3,46,80,750) ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు.

ఇంత భారీ మొత్తం ఖర్చు చేసి ధ్రితికి వైద్యం చేపించే స్థితిలో ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితులు లేవు. విషయం తెలుసుకున్న ‘గోఫండ్‌మి’ అనే ఫండ్‌ రైజింగ్‌ సంస్థ ధ్రితి పరిస్థితిని వివరిస్తూ.. ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇలా చేసిన వారం రోజుల్లోనే.. దాదాపు 12,360 మంది జనాలు ధ్రితికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దాంతో కేవలం ఏడు రోజుల్లోనే 6 లక్షల అమెరికన్‌ డాలర్లు (రూ.4,16,18,700 )విరాళంగా వచ్చాయి. ఈ మొత్తం వైద్యం ఖర్చుల కోసం కావాల్సిన దానికంటే ఎక్కువే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే ధ్రితి ఫ్యామిలీపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌డిని ఇరాక్ ఆర్మీలో ప‌నిచేసిన ఐజ‌య్య జోయెల్ పీపుల్స్ (34)గా గుర్తించారు.
    

Tags:    

Similar News