కేసీఆర్ సర్కారుపై కిషన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు విన్నారా?

Update: 2021-03-07 05:05 GMT
మాటల్లో చురుకుదనం కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి సొంతం. అలాంటి ఆయన.. గడిచిన రెండేళ్లుగా మాట్లాడిన మాటలు.. ఇటీవల కాలంలో ఆయన నోటి నుంచి వస్తున్న మాటల్ని చూస్తే.. మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. కిషన్ రెడ్డి తలుచుకోవాలే కానీ.. ఎలా మాట్లాడతారు? ప్రత్యర్థుల్ని తన మాటలతో ఎంతలా ఉక్కిరిబిక్కిరి చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేం సిత్రమో తెలీదు కానీ.. కేసీఆర్ అండ్ కోను ఘాటుగా వ్యాఖ్యానించిన సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తాయి.

అలాంటి కిషన్ రెడ్డి తాజాగా మాత్రం మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో మాదిరి ఆయన మాటల్లో సురుకు పెరగటమే కాదు.. తీవ్రస్థాయిలో విరుచుకుపడం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా హన్మకొండ.. నల్గొండలో నిర్వహించిన ఎమ్మెల్సీ ప్రచార సభల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి.. కేసీఆర్ సర్కారు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెడామడా తిట్టేసినంత పని చేశారు.

ఎన్నో ఆశలు.. ఆకాంక్షలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజాసంక్షేమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణలో ఉద్యమకారులు రోడ్ల మీద ఉంటే.. ఉద్యమ ద్రోహులు ప్రగతిభవన్ కు చేరుకున్నారన్నారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారినట్లు ఆరోపించారు. సచివాలయానికి రావటం లేదంటే సచివాలయాన్నే కూల్చేసిన గొప్ప సీఎం కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు.

ఏడేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ఆసుపత్రి కట్టలేదని.. కేంద్రం కడతామంటే అందుకు సహకారం అందించలేదన్నారు. 160 ఎకరాల భూమిని రాష్ట్రం ఇవ్వకపోవటం వల్లే రైల్వే ఓవర్ హాలింగ్ పరిశ్రమ నిలిచిపోయిందన్నారు. బీబీ నగర్ లోని మెడికల్ కాలేజీకి ప్రభుత్వం భూములు ఇవ్వలేదని.. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం కింద చెల్లించాల్సిన రాష్ట్ర వాటా రూ.30 కోట్లు ఇవ్వలేదన్నారు. రామగుండంలో రూ.6వేల కోట్లతో ఎరువుల పరిశ్రమను తీసుకొచ్చామని..త్వరలో మోడీ వచ్చి దాన్ని ప్రారంభిస్తారన్నారు. వరంగల్ లో మామూనూరులో స్థలాన్ని ఇస్తే వెంటనే ఎయిర్ పోర్టు ప్రారంభిస్తామన్నారు. మరి.. ఇన్ని ప్రాజెక్టులు రాష్ట్ర సర్కారు తీరుతోనే అన్న కిషన్ రెడ్డి కౌంటర్ కు సీఎం కేసీఆర్ కానీ.. మంత్రి కేటీఆర్ కానీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి వారేం అంటారో?
Tags:    

Similar News