తెలంగాణలో ఆ పార్టీ డబుల్ గేమ్ చూశారా..?

Update: 2019-10-08 13:30 GMT
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఒకటి హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాగా, మరొకటి ఆర్టీసీ కార్మికుల సమ్మె. అయితే ఇందులో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలవాలని ప్రధాన పార్టీలన్నీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ ఆర్టీసీ కార్మికుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. తమ డిమాండ్లని నెరవేర్చాలని గత నాలుగు రోజులుగా కార్మికులు బంద్ చేస్తున్నారు. కానీ వారి డిమాండ్లపై కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. పైగా విధులకు హాజరుకాని వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించేశారు.

కొత్త వారిని నియమించి ఆర్టీసీని నడిపించాలని చూస్తున్నారు. అయితే కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని విపక్షాలు మండిపడుతున్నాయి. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సీపీఐ కూడా కేసీఆర్ సర్కార్ పై ధ్వజమెత్తుతుంది.  కార్మికుల హ‌క్కులను ప్ర‌భుత్వం కాల‌రాస్తుంటే చూస్తూ ఊరుకోమ‌నీ, ఉద్య‌మిస్తామని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట రెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల‌కు తాము అండ‌గా నిలుస్తామన్నారు. అరెస్టు చేసిన ఆర్టీసీ నేత‌ల్ని విడుద‌ల చేయాల‌నీ, గ‌త నెల జీతాలు కూడా వెంట‌నే చెల్లించాలంటూ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

అసలు కేసీఆర్ ప్ర‌క‌టించినంత మాత్రాన ఉద్యోగాలు పోతాయా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ క‌క్ష సాధింపు ధోర‌ణిలో మాట్లాడుతున్నార‌నీ, స‌మ‌స్య ప‌రిష్కారం దిశ‌గా ఆలోచించాల‌న్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే? ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఐ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్ధతు తెలుపుతూ..డబుల్ గేమ్ ఆడుతోంది. అంతలా ఆర్టీసీ కార్మికుల విషయంలో టీఆర్ఎస్ ని వ్యతిరేకిస్తున్నప్పుడు హుజూర్ నగర్ లో మద్ధతు ఉపసంహరించుకుంటే పోయేది ఏమి ఉండదు.

ఇదే ప్రశ్న చాడా వెంకటరెడ్డిని అడిగితే...రాజకీయం వేరు, పోరాటం వేరు అని చెప్పి తప్పించుకుంటున్నారు. సీపీఐ నారాయ‌ణ సైతం అదే మాట చెపుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హుజూర్ నగర్ లో మంచి ఓటు బ్యాంక్ గల సీపీఐ మద్ధతు ఉపసంహరించుకుంటే టీఆర్ఎస్ గెలుపు సంక్లిష్ట‌మ‌య్యే అవకాశముంది. అప్పుడు ఆర్టీసీ విషయంలో టీఆర్ఎస్ కొంచెం ఏమైనా వెనక్కి తగ్గొచ్చు. కానీ అలా చేయకుండా అటు మద్ధతిస్తూ...ఇటు వ్యతిరేకిస్తూ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తుంది.
Tags:    

Similar News