హైద‌రాబాద్-మునుగోడు మ‌ధ్యలో 'హ‌వాలా సొమ్ము'

Update: 2022-10-12 11:01 GMT
ఒక‌వైపు.. మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. నాయ‌కులు రంగంలో కి దిగారు. నామినేష‌న్లు దాఖ‌లు చేస్తున్నారు. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో రాజ‌ధాని హైద‌రాబాద్ నుంచి ఇత‌ర మార్గాల‌కు వెళ్లే దారుల్లో.. భారీగా సొమ్ము పోలీసుల‌కు చిక్కుతోంది. దీనికి ఎలాంటి లెక్క ప‌త్రం లేక పోవ‌డంతో.. పోలీసుల‌కు అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇది హ‌వాలా సొమ్మేన‌ని.. మునుగోడుకు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

తాజాగా హైదరాబాద్ నగరంలో చేతులు మారుతున్న హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపడుతుండగా బంజారాహిల్స్‌ రోడ్ నం-12లో వాహనంలో తరలిస్తున్న రూ.2 కోట్ల నగదు బయటపడింది. డబ్బును తరలిస్తున్న సదరు వ్యక్తులు డబ్బుకు సంబంధించిన సరైన సమాధానం, పూర్తి వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ ఒక్క రోజే కాదు.. హైద‌రాబాద్ నగరంలో 10 రోజుల వ్యవధిలో రూ.10 కోట్లు హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పట్టుబడుతున్న హవాలా సొమ్ము మునుగోడు ఉపఎన్నిక కోసమే చేతు లు మారుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే.. ఈ సొమ్మును ఎవ‌రు త‌ర‌లిస్తున్నారు?  ఎక్క‌డి నుంచి త‌ర‌లిస్తున్నార‌నే విష‌యం మాత్రం అంతు చిక్క‌డం లేదు. పోలీసులు ఈ సొమ్మును ప‌ట్టుకుంటున్నారు స‌రే.. కానీ.. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను వారు రాబ‌ట్ట‌డం లేదు.

ఇదిలావుంటే.. గతంలో దుబ్బాక, హుజూరాబాద్  ఉపఎన్నికలు జ‌రిగాయి. అప్ప‌ట్లోనూ డ‌బ్బులు భారీ మొత్తంలో ప‌ట్టుబ‌డ్డాయి. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థికి చెందిన డబ్బు పదే పదే పట్టుబడింది. ఫోన్లు ట్యాప్ చేశారని రఘునందన్ ఆరోపించారు. ఇప్పుడూ బీజేపీ అభ్యర్థికి చెందిన సొమ్మే ఎక్కువగా పట్టుబడుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో హవాలా వ్యాపారులపై నిఘా పెట్టడం.. ఆ నగదును పట్టుకోవడం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు.. మునుగోడులో ఓటుకు రూ.25 వేల నుంచి 40 వేల దాకా ముట్ట‌చెబుతున్నారని.. స‌ర్పంచ్ నుంచి మండ‌ల‌స్థాయి నాయ‌కుడి వ‌ర‌కు ఎవ‌రికి ఎక్కువ ఓట్లుఉంటాయ‌ని.. భావిస్తున్నారో.. వారికి భారీ స్థాయిలో సొమ్ములు ముట్ట‌చెబుతున్నార‌ని కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. త‌మ త‌మ పార్టీల్లో చేరేవారికి కూడా.. సొమ్ములు ముట్ట‌చెబుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో మునుగోడులో జ‌రుగుతున్న పంప‌కాల ప‌ర్వానికి.. హైద‌రాబాద్‌లో ప‌ట్టుబడుతున్న హ‌వాలా సొమ్ముకు మ‌ధ్య ఎక్క‌డో లింకు ఉంద‌నేవాద‌న బ‌ల‌ప‌డుతోంది. మ‌రి చివ‌ర‌కు పోలీసులు ఏం తేలుస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News