కోడి పందేలపై హైకోర్టు సీరియస్..

Update: 2018-01-04 17:35 GMT
స‌హ‌జంగానే సంక్రాంతి అన‌గానే కోడిపందేలు గుర్తుకువ‌స్తాయి.సంక్రాంతి అంటే భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, ఇంటి నిండా బంధువులు...వారం రోజుల పాటు ఇంటింటా సందడే సందడి. అయితే గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఈ జాబితాలో మరొకటి కూడా ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఈ ఏడాది సంక్రాంతి సంబ‌రాలు ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాల‌కు వేదిక‌గా మారుతున్నాయి. ఒక‌టి కోర్టు రూపంలో కాగా..మ‌రొక‌టి పందేం పుంజుల‌కు సంబంధించిన కొత్త వార్త‌.

ముందుగా కాస్త చేదు విష‌యానికి వ‌స్తే... ఆంధ్రప్రదేశ్ లో కోడి పందేలపై హైదరాబాద్ హైకోర్ట్ సీరియస్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ - ప్రిన్సిపల్ సెక్రటరీ - జిల్లా కలెక్టర్లను హైకోర్ట్ ఆదేశించింది. గతంలో నిబంధనలు ఉల్లంఘించిన 43 మంది తహశీల్దార్ల - 49 మంది ఎస్.హెచ్.ఓ లపై షోకాజ్ నోటీసులు జారీ చేశారని - వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్ట్ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి, ఎట్టి పరిస్థితుల్లో కోడి పందేలు నిర్వహించకుండా చూడాలని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి నివేదికను ఈ నెల 22 కల్లా సమర్పించాలని హైకోర్ట్ ఏపీ సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది.

గత ఏడాది పందేలను అడ్డుకోవడంలో భాగంగా పోలీసులు ముందస్తుగా దాడులు జరిపి పుంజులను స్వాధీనం చేసుకోవడం - కత్తులు కట్టే వారిపై బైండోవర్ కేసులు నమోదుచేయడం వంటి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈసారి పుంజుల పెంపకందార్లు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సంక్రాంతి సంప్రదాయం ముసుగులో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో నిర్వహించే పందేలకు కోడిపుంజులు ప్రస్తుతం  గుట్టుచప్పుడు కాకుండా సిద్ధమవుతున్నాయి. అయితే ఇవి పాకిస్తాన్ కోళ్లు. ఔను పాక్ కోళ్లు ప్ర‌స్తుత సంక్రాంతి బ‌రిలో ఉండ‌నున్నాయి.

మ‌న రాష్ట్రంలో జరిగే పందేల‌కు పాక్ కోళ్లు ఏంట‌ని అనుకోకండి...పాక్ అంటే అంతే క్రేజా అనుకోకండి. పాక్ నుంచి తెచ్చిన ప్ర‌త్యేక బ్రీడ్‌తో పందెం కోళ్ల‌ను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా కత్తులు కట్టకుండా వేసే పందాల్లో పాకిస్థాన్ బ్రీడ్ కోళ్లు పౌరుషంగా తలపడే తీరు చూసితీరాల్సిందేనట. అందుకే ప్రత్యేక శిక్షణతో పెంచే పందెం పుంజుల‌ను రెడీ చేస్తున్నారు. ఇవే కాదు తైవాన్, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల నుంచి కూడా ప్రత్యేకంగా బ్రీడ్ తెప్పించి పెంచుతున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఇటు కోడి పందేలు, అందులో పందేలు కాయ‌డం వంటివి ఎప్ప‌టి నుంచో ఉన్నాయ‌ని అంటున్నారు. కోడి పందేల పై పందాలు కాయడం ఈనాడు కొత్తగా మొదలైంది కాదు మధ్య యుగాల నాటి నుంచే ఉంద‌ట‌. రాజులు, రాజ్యాలున్న‌ స‌మ‌యంలో ఈ కోడి పందేలు చూస్తూ ఎంజాయ్ చేయడమే కాదు...గెలుపోటములపై పందేలు కాసేవారు...చివరకు రాజ్యాలు కూడా ఫణంగా పెట్టేవారు. అయితే ఇప్పుడు రాజ్యాలు లేకపోయినా.. కోడిపందేలపై బెట్టింగుల జోరు మాత్రం ఓ రేంజ్‌కి పెరిగిపోయింది. మ‌రోవైపు లిఖించబ‌డిన చ‌రిత్ర‌లో సైతం కోడిపందేలా గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. 1646లో జార్జి విల్సన్‌ అనే రచయిత కాక్‌ ఆఫ్‌ ది గేమ్‌ అనే పుస్తకంలో కోడి పందేల గురించి ప్రస్తావించడం గమనార్హం. అమెరికా - జపాన్‌ - ఇరాన్‌ - ఇండోనేషియా - బ్రెజిల్‌ - పెరు - ఫిలపైన్స్‌ - మెక్సికో - ఫ్రాన్స్‌ - క్యూబా - పాకిస్తాన్‌ మొదలైన దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోడి పందేలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

అయితే పందెంలో గెలిచిన కోడికే కాదు..ఓడిన వాటికి కూడా..ప్ర‌త్యేక డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే...పందెం పుంజుల‌ను పెంచడానికి అత్యంత బలమైన ఆహారం...ఒక్కో కోడికి వేల రూపాయల నుంచి లక్షలు ఖర్చు చేసి ఖరీదైన, బలమైన తిండి పెడతారు. వాటికోసం ప్రత్యేక ట్రైనర్లు కూడా ఉంటారు. అందుకే ఆ మాంసం రుచి ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే పందెంలో ఓడిన మాంసానికి డిమాండ్‌. ఇంకా చెప్పాలంటే పోటీ కూడా!పందెంకోడిని బంధుమిత్రులకు వండిపెట్టడం గొప్పగా భావిస్తారు గోదావ‌రి జిల్లాల్లో!

మ‌రోవైపు ఈ పాకిస్తానీ పుంజుల‌కు కొత్త వార్త‌ సైతం తోడ‌యింది. సంక్రాంతి సమయంలో ఎక్కడలేని డిమాండ్‌ ఉంటుంది. దీనితో పుంజుల పెంపకాన్ని కొంతమంది ఓ వ్యాపకంగా చేపట్టేవారు. అయితే గత ఏడాది చేదు అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది చాలామంది పుంజుల పెంపకానికి దూరమయ్యారు. దీనితో పందేలు పాల్గొనే వారు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. గత ఆరు నెలలుగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రహస్యంగా పుంజులను పెంచుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రా సరిహద్దులకు సమీపంలోని తెలంగాణ ప్రాంతంలో గత ఆరు నెలలుగా పుంజుల పెంపకం చేపట్టారు. ఈ పుంజులను పందేలకు కొద్ది రోజుల ముందు నేరుగా బరులు ఏర్పాటుచేసే ప్రాంతాలకు తరలించేలా ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నారు. స్థూలంగా ఇది..కోడి పందేలు..పాకిస్థాన్ - తెలంగాణ రాష్ర్టాల క‌థ‌.


Tags:    

Similar News