అంత జరిగితే కానీ మోడీ సీన్లోకి రారన్నమాట

Update: 2016-10-03 07:37 GMT
ఏదైనా అంశం మీద ప్రధాని మోడీ రియాక్షన్ ఎంత వేగంగా ఉంటుందన్నవిషయంపై ఈ మధ్యన కాస్త స్పష్టత వస్తోందని చెప్పాలి. సార్వత్రిక ఎన్నికలకు ముందు.. ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్న సమయంలోనూ.. ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో దేశంలో ఎక్కడ ఏ పెద్ద అంశం జరిగినా వెంటనే.. ప్రధాని కార్యాలయం నుంచి ఫాలోఅప్ ఉండేది. ఆ సమాచారం వెనువెంటనే ప్రచార మాధ్యమాలకు అందించే వారు. సదరు ఘటన మీద ప్రధాని నజర్ ఉందన్న భావన కలిగేలా పరిస్థితి ఉండేది.

ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్లు అవుతున్న వేళ.. ఆయన తీరు ఎలా ఉందన్నది చూస్తే.. ఆసక్తికర కోణం కనిపించటం ఖాయం. గతంలో మాదిరి ఏదైనా జరిగిన వెంటనే.. స్పందించే తీరుకు భిన్నంగా మోడీ వ్యవహరిస్తున్నారు. గతంలో మాదిరి స్పీడ్ లేనట్లుగా ఆయన తీరు ఉంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తేనే అర్థమవుతుంది. కర్ణాటక – తమిళనాడు రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న వివాదం ఎంత పెద్దదన్నది తెలిసిందే. ఆ రెండు రాష్ట్రాలతో పాటు.. చుట్టూ ఉన్న సరిహద్దు రాష్ట్రాల మీద కూడా కావేరీ వివాద ప్రభావం పడిన దుస్థితి.

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల్ని అమలు చేసే విషయంలో కర్ణాటక ప్రభుత్వం ససేమిరా అనటమే కాదు.. ఆ రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ కావేరీ ఇష్యూ మీద ఒకే మాట మీద ఉండటం తెలిసిందే. తమిళనాడుకు కావేరీ జలాల్ని విడుదల చేయాలన్న సుప్రీం ఆదేశాల్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయలేమని తేల్చి చెప్పేయటం.. దీనిపై సుప్రీం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వైనం గడిచిన కొద్దిరోజులుగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. మాజీ ప్రధాని దేవగౌడ సైతం కర్ణాటక ప్రభుత్వానికి దన్నుగా సీన్లోకి రావటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. కావేరీ ప్రాజెక్టులలో నీరు లేని కారణంగా ప్రస్తుతం తమిళనాడుకు నీరు విడుదల చేయలేమన్న మాటను సుప్రీం మన్నించి.. తన తీర్పును మార్చాలని కోరుతూ మరోసారి అసెంబ్లీలో సమిష్టి తీర్మానం చేయాలని నిర్ణయించారు.

ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ.. మాజీ ప్రధాని దేవగౌడకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. కావేరీ వివాదాన్ని మరింత కాలం కొనసాగించబోమని.. ఈ ఇష్యూను పరిష్కరిస్తామని మోడీ తనతో చెప్పినట్లుగా దేవగౌడ చెబుతున్నారు. నిజానికి ఈ చొరవ మోడీ ముందే తీసుకోవాల్సింది. సుప్రీం నిర్ణయాన్ని ఎప్పుడైతే కర్ణాటక రాజకీయ పక్షాలన్నీ కుదరవంటూ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చిన వెంటనే.. ప్రధాని మోడీ కలుగజేసుకొని ఉంటే పరిస్థితి ఇంత వరకూ వచ్చేది కాదు. రెండు వ్యవస్థల మధ్య పోరు ఏ మాత్రం సరికాని వేళ.. అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్నప్పుడు.. అలాంటిది చోటు చేసుకోకముందే మోడీ స్పందిస్తే బాగుండేది. కానీ.. అందుకు భిన్నంగా పరిస్థితి సున్నితంగా మారాక కానీ ఆయన సీన్లోకి రాని పరిస్థితి. చూస్తుంటే.. ప్రత్యేక పరిస్థితులు వస్తే కానీ మోడీ సీన్లోకి రారన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకోవటం దేనికి సంకేతం అన్నది ఇప్పుడు వేధించే ప్రశ్నగా చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News