'కుమార' త్యాగం.. కర్ణాటక కొత్త సీఎం ఇతడే.!?

Update: 2019-07-22 05:58 GMT
కర్ణాటక రాజకీయాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. సోమవారం ఎట్టిపరిస్థితుల్లోనూ బలపరీక్ష నిర్వహించి జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ మైనార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ కాచుకూర్చుంది. గవర్నర్ ద్వారా సోమవారమే గడువు అని లేకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. ఇక కాంగ్రెస్ - జేడీఎస్ లు మాత్రం సోమవారం ఎలాగైనా విశ్వాసపరీక్ష జరగకుండా విశ్వప్రయత్నాలు చేస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేందుకు సిద్ధమైంది. అవసరమైతే ముఖ్యమంత్రి మార్పునకు సిద్ధమవుతోంది. కుమారస్వామి సీఎం కుర్చీ దిగడానికి రెడీ అయిపోయారని సమాచారం.

తాజాగా కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు సీఎం పదవిని త్యాగం చేయడానికి కుమారస్వామి సిద్ధమయ్యారని.. కాంగ్రెస్ నుంచి ఒకరు సీఎం పదవి చేపట్టే అవకాశముందని చెప్పాడు. సంకీర్ణ సర్కారును కాపాడేందుకే జేడీఎస్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

కాగా కుమారస్వామి సీఎం పదవి వదులుకునేందుకు సిద్ధమైన నేపథ్యంలో కాంగ్రెస్ లో ప్రధానంగా ముగ్గురి పేర్లు సీఎం రేసులో వినపడుతున్నాయి. మాజీ సీఎం సిద్ధరామయ్యతోపాటు పరమేశ్వర - డీకే శివకుమార్ లలో ఎవరినో ఒకరిని అసమ్మతి ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అసమ్మతి ఎమ్మెల్యేలను ఈ మేరకు శివకుమార్ వెనక్కి రప్పించే ప్రయత్నాలను చేస్తున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. అసంతృప్తులు మెజార్టీగా ట్రబుల్ షూటర్ అయిన డీకే శివకుమార్ కే మద్దతు పలుకుతున్నారని సమాచారం. ఇక కీలకమైన జేడీఎస్ అధినేత దేవెగౌడ కూడా సిద్ధరామయ్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శివకుమార్ సీఎం అయితేనే మద్దతిస్తామని ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి పరమేశ్వరను కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. అయితే సిద్ధరామయ్య లేదా డీకే శివకుమార్ లలో ఒకరు కన్నడ సీఎం పీఠం అధిరోహించవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 

Tags:    

Similar News