100 రోజుల పాలనలో 50 తీర్థయాత్రలు చేసిన సీఎం

Update: 2018-09-01 14:03 GMT
ముప్ఫయ్యేడు సీట్లతో ముఖ్యమంత్రయిపోయిన కుమారస్వామి ఇప్పుడు తన 100 రోజుల సీఎంగిరీలో మరో సరికొత్త రికార్డు సృష్టించారు. గుళ్లూగోపురాలు తిరగడంలో మాంచి పేరుప్రఖ్యాతులున్న మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మకు కానీ, తెలుగు రాష్ట్రాల గవర్నరు నరసింహన్‌ కు కానీ సాధ్యం కాని రీతిలో... అలాగే హిందూత్వావాదులని ముద్రపడిన బీజేపీ నేతలకు కానీ, ఓట్లకోసం వారిని ఫాలో అవుతూ కైలాస మానసరోవర్ యాత్రకు బయలుదేరిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కానీ ఏమాత్రం సాధ్యం కానీ స్టైల్‌లో కేవలం వందంటే 100 రోజుల్లో 50 ప్రార్థనాస్థలాలను సందర్శించారు కుమారస్వామి.
    
కాంగ్రెస్ సహకారంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన సీఎంగా వంద రోజుల్లోపే 50 మసీదులు, ఆలయాలు, చర్చిలకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేశారు. ఒక్క కర్ణాకటకే కాదు పొరుగు రాష్ట్రాల్లోని గుళ్లూగోపురాలనూ ఆయన దర్శించుకుంటున్నారు. మొత్తంగా తన 100 రోజుల పాలనలో ఆయన 47 ఆలయాలు, ఒక దర్గా, ఒక మసీదు, ఒక చర్చికి వెళ్లారు.
    
100 రోజుల్లో 50 ప్రార్థనాస్థలాలంటే ప్రతి రెండు రోజులకు ఒకటి దర్శించుకుంటున్నట్లు కాదు.. ఒక్కో రోజు రెండు మూడు కూడా కవర్ చేస్తున్నారాయన. దీంతో కుమారస్వామి ఆధ్యాత్మిక యాత్రలు ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్నాయి. సొంత పార్టీ నేతలు కూడా ఆయన తీరు చూసి విమర్శలు చేస్తున్నారట. పాలన గాలికొదిలి ఇలా తీర్థయాత్రల్లో ఉంటే ఎలా అంటున్నారట.
    
కాగా సీఎం సీటు పోతుందేమోనన్న భయంతోనే ఆయనలా తిరుగుతున్నారని ప్రత్యర్థి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు కుమారస్వామి తండ్రి దేవెగౌడ కూడా తాను సీఎంగా ఉన్నప్పుడు గుళ్లూగోపురాలకు ఎక్కువగానే తిరిగేవారు కానీ కుమారస్వామి ఆయన్ను మించిపోయారు.
Tags:    

Similar News