ఆయ‌న క్షేమంగానే ఉన్నారుః మావోయిస్టు పార్టీ

Update: 2021-06-28 13:30 GMT
నిత్యం పోలీసుల నుంచి ప్ర‌మాదం ఎదుర్కొనే మావోయిస్టులు.. ఇప్పుడు క‌రోనా నుంచి తీవ్ర విప‌త్తునే ఎదుర్కొంటున్నారు. ఈ మ‌ధ్య‌నే తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి హ‌రిభూష‌ణ్ కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. అదేవిధంగా భార‌త‌క్క సైతం క‌రోనాతో చ‌నిపోయారు. దీంతో.. తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శిని నియ‌మించేందుకు కేంద్ర నాయ‌క‌త్వం క‌స‌ర‌త్తులు చేస్తోంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లోనే.. మ‌రో కీల‌క నేత, పీపుల్స్ లిబ‌రేష‌న్ గెరిల్లా ఆర్మీ బెటాలియ‌న్ - 1 క‌మాండ‌ర్ మాద్వి హిడ్మా క‌రోనా బారిన ప‌డ్డార‌నే ప్ర‌చారం మొద‌లైంది. దీన్ని ఖండిస్తూ తెంగాణ రాష్ట్ర క‌మిటీ అధికార ప్ర‌తినిధి జ‌గ‌న్ ఓ లేఖ విడుద‌ల చేశారు.

హిడ్మా క‌రోనా బారిన‌ప‌డిన‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా శార‌ద‌, ఛ‌త్తీస్ గ‌ఢ్ బ‌స్త‌ర్ ఏరియాలోని ప‌లువురు అగ్ర‌నేత‌లు కూడా క‌రోనా బారిన ప‌డ్డార‌నే ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఇందులో వాస్త‌వం లేద‌ని పేర్కొన్నారు. ఇదంతా.. పోలీసులు, ప్ర‌భుత్వాలు చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారంగా చెప్పారు.

కొవిడ్ కార‌ణంగా వేలాది మంది ప్ర‌జ‌లు చ‌నిపోతుంటే.. వారిని కాపాడేందుకు ప్ర‌య‌తించ‌లేని ప్ర‌భుత్వం.. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ.. మావోయిస్టుల‌ను అణ‌చివేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. క‌రోనా విష‌యంలో బ‌య‌టి వ్య‌క్తులు చేస్తున్న ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని, అధికారికంగా మావోయిస్టు పార్టీ ప్ర‌క‌టించిన‌ప్పుడే విశ్వ‌సించాల‌ని కోరారు.
Tags:    

Similar News