పార్టీ పుట్టి మునిగిపోయే ప‌రిస్థితి వ‌చ్చినా.. సీనియ‌ర్ల తీరు మార‌దా?

Update: 2021-07-29 14:48 GMT
ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల‌కు ఆశాదీపంగా క‌నిపిస్తున్న నాయ‌కుడు రేవంత్ రెడ్డి మాత్ర‌మే. రెండుసార్లు అధికారం కోల్పోయిన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే కెపాసిటీ ఆయ‌న‌కు మాత్ర‌మే ఉంద‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు న‌మ్ముతున్నారు. ఇది రేవంత్ ప్ర‌మాణం రోజునే అర్థ‌మైంది. పీసీసీ అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం చేసినందుకే.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి స్వీక‌రిస్తున్నంత హంగామా చేశారు కార్య‌క‌ర్త‌లు, నేత‌లు. ఇది చూసిన వారికి రేవంత్ కు పీసీసీ ఇవ్వ‌డం స‌బ‌బే అనే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మైంది. స్పీచ్ దంచికొట్టిన రేవంత్‌.. పార్టీ శ్రేణుల్లో అంత‌కు ముందు లేని ఉత్సాహాన్ని ఉర‌కలెత్తించారు.

అయితే.. కేవ‌లం మాట‌ల యుద్ధం కొన‌సాగించే నేత‌ను మాత్ర‌మే కాద‌ని, తాను అంద‌రినీ స‌మ‌న్వ‌య ప‌రిచే అస‌లైన రాజ‌కీయ‌వేత్త‌ను అని కూడా చాటుకుంటున్నారు రేవంత్‌. పీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌ర్నాటి నుంచే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. కాంగ్రెస్ ను బ‌లోపేతం చేసేందుకు ఏమేం చేయ‌గ‌ల‌రో.. అన్నీ చేస్తూ వ‌స్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన‌ మాజీ ఎంపీ, సీనియ‌ర్ నేత కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు. ఈ మేర‌కు రేవంత్ మాట్లాడ‌డం.. విశ్వేశ్వ‌ర్ రెడ్డి సానుకూలంగా స్పందించ‌డం అన్నీ జ‌రిగిపోయాయి. కాంగ్రెస్ లో త్వ‌ర‌లోనే చేరుతాన‌ని ఆయ‌న‌ చెప్పారు. ఆ త‌ర్వాత‌.. వెంట‌నే మ‌రో కీల‌క నేత‌కు కాంగ్రెస్ కండువా క‌ప్పేందుకు రంగం సిద్ధం చేశారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు మ‌రాఠా చంద్ర‌శేఖ‌ర్ అలియాస్ ఎర్ర శేఖ‌ర్ ను కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చి అల‌జ‌డి సృష్టించారు. ఆ త‌ర్వాత కూడా కాంగ్రెస్ కు వ‌ల‌స‌ల‌ను పెంచారు. ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ప్ర‌స్తుత టీఆర్ఎస్ నాయ‌కుడు డి.శ్రీనివాస్ కుమారుడు సంజ‌య్ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అనంత‌రం టీడీపీ సీనియ‌ర్ నేత‌గా ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన దేవేంద‌ర్ గౌడ్ ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు ఆయ‌న కూడా సుముఖ‌త వ్య‌క్తం చేశారు.

ఈ విధంగా.. కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేసేందుకు పీసీసీ అధినేత‌గా రేవంత్ శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. కానీ.. ఆయ‌న‌కు ఇత‌రుల నుంచి మాత్రం స‌హ‌కారం ల‌భించ‌ట్లేదు. ఒక్క‌రిద్ద‌రు సీనియ‌ర్లు మిన‌హా.. ఆయ‌న‌కు ఎవ‌రూ స‌పోర్టు చేయ‌ట్లేద‌న్న‌ది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కోమ‌టిరెడ్డి వంటి నేత‌లైతే.. ఏదో విధంగా రేవంత్ కు వ్య‌తిరేక స్వ‌రం వినిపించేందుకే ప్ర‌య‌త్నిస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. హుజూరాబాద్ లో తాను స‌ర్వే చేశానని, కాంగ్రెస్ కు 5శాతం ఓట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని చెప్ప‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. ఇలా.. సీనియ‌ర్లుగా ఉన్న‌వారు స‌హ‌కారం అందించ‌క‌పోగా.. పార్టీని బ‌లోపేతం చేస్తున్న రేవంత్ ను ఇలా కింద‌కు లాగే ప్ర‌య‌త్నం చేయ‌డమేంట‌ని ఆయ‌న వ‌ర్గీయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక‌, మిగిలిన సీనియ‌ర్ల‌లో కూడా చాలా మంది బ‌య‌ట ప‌డ‌కుండా ఉన్నార‌ని, వారు కూడా రేవంత్ కు పీసీసీ ఇవ్వ‌డాన్ని ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని అంటున్నారు. రేవంత్ కు స‌హ‌కారం అందించ‌కుండా.. పైకి వ్య‌తిరేకంగా మాట్లాడ‌కుండా.. ఉంటున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో.. స్వ‌యంగా కాంగ్రెస్ శ్రేణులే మండిప‌డుతున్నాయి. ఇప్ప‌టికే రెండుసార్లు అధికారం కోల్పోయినా.. పార్టీ పుట్టి మునిగిపోయే ప‌రిస్థితి వ‌చ్చినా.. సీనియ‌ర్ల తీరు మార‌దా? అని నిల‌దీస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీ మ‌ధ్య‌లోకి దూసుకొచ్చి.. తామే ప్ర‌త్యామ్నాయం అని ప్ర‌చారం చేసుకుంటున్న‌ప్ప‌టికీ.. వీరి ప‌ద్ధ‌తి మార‌క‌పోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి, ఇక‌నైనా ప‌ద్ధ‌తి మార్చుకుంటారా? లేదా అన్నది చూడాలి.




Tags:    

Similar News