కోవాక్సిన్ టీకా వేసుకున్నాడు.. ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు

Update: 2021-08-19 00:30 GMT
భారత్ తయారు చేసిన కోవాక్సిన్ టీకా దేశంలో అనుమతి ఉన్నా విదేశాల్లో అనుమతి లేదు. ఇంకా భారత్ బయోటెక్ తయారు చేసిన టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి రాలేదు. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లాలనుకునే వ్యక్తులు, ఉద్యోగం చేసుకునే వారంతా బ్రిటన్ దేశంలోని ఆక్స్ ఫర్డ్ వర్సిటీ తయారు చేసిన కోవీషీల్డ్ టీకానే వేసుకోవాలని భారత ప్రభుత్వం సూచిస్తోంది.

ఈ క్రమంలోనే సౌదీ అరేబియాలో ఉద్యోగానికి ఎంపికైన ఒక వ్యక్తి వీసా టైమ్ వచ్చింది. అయితే విదేశాలకు వెళ్లాలంటే కోవీషీల్డ్ వేసుకొని ఆ సర్టిఫికెట్ చూపిస్తే ఆ దేశంలోకి అనుమతిస్తారు. అయితే ఆ వ్యక్తి కోవీషీల్డ్ టీకా వేయించుకోకుండా కోవాక్సిన్ వేయించుకొని పొరపాటు చేశాడు. ఈ నెలలోనే వీసా టైమ్ కూడా తీరిపోవడంతో అతడు ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.

భారత్ బయోటెక్ తయారు చేసిన పూర్తి స్థాయి స్వదేశీ టీకా కోవాగ్జిన్ కు ఇతర దేశాల్లో చాలా చోట్ల అనుమతి లేదు. సీరం సంస్థ మన దేశంలో పంపిణీ చేస్తున్న ఆక్స్ ఫర్డ్ తయారీ కోవీషీల్డ్ కు మాత్రమే ప్రపంచ ఆరోగ్యసంస్థ సహా అనేక ఇతర దేశాల్లో గుర్తింపు ఉంది.

దీంతో కొందరు కోవాగ్జిన్ తీసుకున్న వారు విదేశాలకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై కొందరు సుప్రీంకోర్టుకు కూడా ఎక్కారు. దీంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది.

కేరళలోని కన్నూర్ ప్రాంతానికి చెందిన గిరికుమార్   సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తుండేవాడు. సెకండ్ వేవ్ మొదలయ్యాక భారత్ కు తిరిగి వచ్చాడు. ఈక్రమంలోనే కోవిన్ పోర్టల్ లో తన పేరు నమోదు చేసుకొని ఏప్రిల్ లో కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాడు. ఇటీవల సెకండ్ డోస్ కూడా పూర్తయ్యింది. తీరా సౌదీ అరేబియా వెళ్లడానికి రెడీ అవుతున్న వేళ కోవాక్సిన్ టీకాకు సౌదీ అరేబియా గుర్తింపు లేదని అతడికి అనుమతి నిరాకరించారు.

ఈ క్రమంలోనే తనకు కోవీషీల్డ్ టీకా వేయాలని వైద్యసిబ్బందిని సంప్రదించగా వారు నిరాకరించారు. ఇదివరకే కోవాగ్జిన్ వేసుకోవడంతో నిరాకరించారు. సౌదీ వెళ్లకపోతే తన ఉద్యోగం పోతుందని ఈ సమస్యను పరిష్కరించాలని అతడు కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై హైకోర్టు కేంద్రానికి నోటీసులిచ్చింది. అయితే కేంద్రం డబుల్ టీకా వేసుకోవడం కుదరదని తేల్చిచెప్పింది.  అలావేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని తేల్చిచెప్పింది. అనారోగ్యానికి దారితీస్తుందని తెలిపారు.

దీంతో హైకోర్టు గిరికుమార్ పిటీషన్ ను కొట్టివేసింది. ఇప్పుడు అతడు సౌదీ వెళ్లలేక ఉద్యోగం కోల్పోయిన పరిస్థితి తెచ్చుకున్నాడు.
Tags:    

Similar News