మతానికి సంబంధించిన అంశాలపై నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంటాయి ప్రభుత్వాలు. ఎందుకంటే భావోద్వేగాలను భంగపర్చటం.. విశ్వాసాలకు నొప్పి కలిగించేలా చేయటం సరికాదన్న సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఎందుకిలాంటి మాట అంటున్నామంటే.. హిందూ మతానికి సంబంధించిన అంశాల మీద ఇష్టం వచ్చినట్లుగా.. ప్రజల సెంటిమెంట్లతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవటం తరచూ జరుగుతుండటమే దీనికి కారణం.
ఎక్కడి దాకానో ఎందుకు శని దేవాలయంలోకి మహిళల ప్రవేశం గురించి కానీ.. శబరిమలలో కొన్ని వయస్కులకు చెందిన మహిళల్ని అనుమతించని వైనంపై కోట్లాది మంది మనోభావాల్ని పక్కన పెట్టేసి.. గుప్పెడు మంది మాటలకు అనవసరమైన ప్రచారం కల్పిస్తూ.. వారి వాదనకు మద్దతు ఇచ్చే ఉదంతాలెన్నో చూశాం.
తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అన్య మతస్తులు స్వామి వారి మీద తమకు విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధన విషయంలో వివాదం తెర మీదకు వచ్చింది. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అన్నట్లుగా మీడియాలో వచ్చిన మాటల్లో నిజం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్న. గతంలో మాదిరి మీడియాలో వచ్చే ప్రతిదీ పెద్ద బాలశిక్షలా లేకపోవటం.. ఎవరి భాష్యం వారు వల్లె వేయటం ఇప్పుడు ఎక్కువ అవుతోంది.
ఈ నేపథ్యంలో శ్రీవారి డిక్లరేషన్ అంశంలో టీటీడీ ఛైర్మన్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారు? అన్నది రికార్డెడ్ వెర్షన్.. అది కూడా ఆ మాటకు ముందు.. వెనుకా ఎలాంటి ఎడిట్ లేని మాటలు విన్నప్పుడు మాత్రమే ఆయనేం అన్నారు? ఎలాంటి ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారన్న అంశంపై క్లారిటీ వస్తుంది. ఇక.. డిక్లరేషన్ మీద చర్చ నడుస్తున్న వేళ.. దీనికి సంబంధించిన ఆసక్తికర అంశాలు కొన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒకరి మతవిశ్వాసాల్ని గౌరవిస్తాం.. నమ్ముతామని చెప్పటం తప్పేముంది? ఒకవేళ అలాంటిది లేనప్పుడు సదరు పుణ్యక్షేత్రానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఈ విషయాన్ని మొదట్లో ప్రముఖులు తూచా తప్పకుండా పాటించటం కనిపిస్తుంది. ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఇందిరమ్మ సైతం శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ పత్రం మీద సంతకం చేశారు. జన్మత: ఆమె హిందువే అయినా.. పార్శీ వ్యక్తిని పెళ్లాడటంతో ఆమె సంతకం పెట్టాల్సి వచ్చింది. తొలుత సంతకం పెట్టటానికి ఆమె సంశయించినా.. తర్వాత పెట్టేశారు.
కేంద్రమంత్రి హోదాలో వచ్చిన జాఫర్ షరీఫ్ కు టీటీడీ అధికారులు డిక్లరేషన్ గురించి చెప్పినప్పుడు.. స్వామి మీద భక్తి లేనప్పుడు ఎక్కడి నుంచో ఎందుకు వస్తాను.. పత్రాన్ని తీసుకురండి అంటూ అడిగి మరీ తెప్పించుకొని సంతకం పెట్టారు. ఇక.. కశ్మీరీ నేత.. ఆ రాష్ట్రానికి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఫరూక్ అబ్దుల్లా సైతం డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన వారే. రాష్ట్రపతిగా వ్యవహరించిన అబ్దుల్ కలామ్ సైతం సంతకం పెట్టినోళ్లే.
ఇదంతా బాగానే ఉన్నా.. 1998లో సోనియా గాంధీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు అప్పటి ఈవో ఐవీ సుబ్బారావు ఆమెకు డిక్లరేషన్ గురించి చెప్పారు. సంతకం పెట్టటానికి సోనియా నో చెప్పారు. దీనిపై అప్పటి సీఎం చంద్రబాబును ఐవీ సుబ్బారావు సలహా కోరగా.. ఆలయ సంప్రదాయం ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేశారు. చివరకు సోనియా డిక్లరేషన్ మీద.. ‘‘నేను భారతీయ మహిళను. భారతీయ సంప్రదాయాలు.. కుటుంబ ఆచారాలు పాటిస్తున్నాను’’ అని పేర్కొని సంతకం చేశాకే దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు.
ఇలా ప్రముఖులంతా డిక్లరేషన్ మీద సంతకం పెట్టగా.. అందుకు భిన్నంగా వ్యవహరించిన వ్యక్తిగా నాటి ఏపీ హూకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూగానే చెప్పాలి. తిరుమలకు వచ్చిన ఆయనకు టీటీడీ అధికారులు డిక్లరేషన్ గురించి చెబితే.. సంతకం పెట్టటానికి ఇష్టపడలేదు. అదే సమయంలో మీ సంప్రదాయానికి నేను గౌరవిస్తానని చెప్పిన ఆయన.. సంతకం పెట్టలేదు. దర్శనం చేసుకోకుండా వెనక్కి వెళ్లిపోయారు. ఇలా.. ఎదుటివారి సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇవ్వటంలో పోయేదేముంది? ఎంత ప్రముఖులైనా.. ఎంతటి అత్యున్నత స్థానాల్లో ఉన్న వారైనా.. దేవుడు (నమ్మకం ఉన్న వారికి) ముందు చిన్న వారే కదా? అయినా.. ఒకరి నమ్మకాన్ని విశ్వసిస్తున్నానని చెప్పటానికి మించిన పెద్ద మనసు ఇంకేం ఉంటుంది? ఇలాంటి వాటి విషయంలో అనవసరమైన వివాదాలు ఏ మాత్రం తగదు.