ఆశా వ‌ర్క‌ర్ల‌కు టీ స‌ర్కార్ బంప‌ర్ ఆఫ‌ర్ !

Update: 2022-06-09 10:30 GMT
తెలంగాణ వాకిట ఆశావ‌ర్క‌ర్ల‌కు వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. ఇక‌పై సాధార‌ణ ప్ర‌స‌వాలు చేసే వారికి ఆర్థికంగా కొంత ప్ర‌యోజ‌నం ద‌క్కే విధంగా ప్రోత్స‌హించ‌నున్నామ‌ని చెప్పారు. ఆ విధంగా ఒక్కో ప్ర‌స‌వానికి మూడు వేల రూపాయ‌లు జీతంతో పాటు అద‌నంగా చెల్లిస్తామ‌ని ఆశ వ‌ర్క‌ర్ల‌కు మంత్రి హరీశ్ భ‌రోసా ఇచ్చారు.

ఆశ వ‌ర్క‌ర్ల‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప‌నిచేస్తున్న ఏఎన్ఎంల‌కు, వైద్యులకు, సిబ్బందికి ఈ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌ర్తించ‌నుంది. ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో సాధార‌ణ ప్ర‌స‌వాల‌ను ప్రోత్స‌హించే దిశ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతున్న చ‌ర్య‌ల్లో భాగంగా ఇదొక శుభ ప‌రిణామంగానే చూడాలి.

వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో కార్పొరేట్ వైద్యం పుణ్య‌మాని సాధార‌ణ ప్ర‌స‌వాల‌కు మొగ్గు చూప‌ని వారే ఎక్కువ‌య్యారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో కూడా నార్మ‌ల్ డెలివ‌రీ వ‌ద్దే వ‌ద్ద‌ని కొంద‌రు గ‌ర్భిణులు ప‌ట్టుబడుతున్నారు. ముహూర్తం నిర్ణ‌యించి మ‌రీ! సిజేరియ‌న్ ఆప‌రేష‌న్లు చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఇదే అదునుగా గ‌ర్భిణులు త‌మ పంతం నెగ్గించుకునే క్ర‌మంలో వైద్యుల‌పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. వైద్యులు వ‌ద్ద‌ని స‌ల‌హా చెప్పినా విన‌డం లేదు.

సాధార‌ణ ప్ర‌స‌వం  కార‌ణంగా ఎటువంటి కాంప్లికేష‌న్లు కానీ పోస్ట్ డెలివ‌రీ కాంప్లికేష‌న్ల పేరిట ఇబ్బందులు కానీ ఉండ‌వు అని చెప్పినా చాలా మంది వినిపించుకోక మొండికేస్తున్నారు.ఈ క్ర‌మంలో తెలంగాణ స‌ర్కారు తీసుకున్న ఈ నిర్ణ‌యంపై అంత‌టా ఆనందం వ్య‌క్తం అవుతోంది.

నార్మ‌ల్ డెలివ‌రీలను ప్రోత్స‌హిస్తే ప్ర‌స‌వానంత‌రం కూడా తల్లి ఆరోగ్యంకు ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు స‌రికదా! కొంత‌లో కొంత వైద్య సిబ్బందికి ఒత్తిడి కూడా త‌గ్గుతుంది. పోస్ట్ డెలివ‌రీ పేరిట ఎక్కువ రోజుల పాటు ఆస్ప‌త్రికే ప‌రిమితం కావ‌డ‌మో, ఆస్ప‌త్రుల చుట్టూ తిర‌గ‌డ‌మో అన్న‌వి జ‌ర‌గ‌వు. ఒకప్పుడు చేసిన విధంగా నార్మ‌ల్ డెలివ‌రీలు చేస్తే తీవ్ర ర‌క్త‌స్రావం అన్న‌ది కూడా కాదు.

ఓ విధంగా తల్లి ఆరోగ్యానికి సాధార‌ణ ప్ర‌స‌వ‌మే ఎంతో మేలు. ఎలానూ ఆధునిక వ‌స‌తుల‌తో కూడిన ఆస్ప‌త్రులు అన్న‌వి తెలంగాణ‌లో ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం ముమ్మ‌ర ప్ర‌యత్నాలు చేస్తుంది క‌నుక వాటిని వినియోగించుకుంటూనే గ‌ర్బిణులు సాధార‌ణ ప్ర‌సవాల‌వైపు మొగ్గు చూపాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వ వ‌ర్గాలు కోరుతున్నాయి. ఈ విధంగా వైద్యారోగ్య  సిబ్బంది గ‌ర్భిణుల‌కు మాన‌సికంగా స‌న్న‌ద్ధం చేయాల‌ని, వారి మోటివేష‌న్ కార‌ణంగానే స‌ర్జ‌రీ బేస్డ్ డెలివ‌రీలు త‌గ్గుతాయి అని ఓ అభిప్రాయం సామాజిక కార్య‌క‌ర్త‌ల నుంచి వ్య‌క్తం అవుతోంది.
Tags:    

Similar News