చిట్టీలో పెద్ద అక్షరాల వెనుక తెలు‘గోడు’

Update: 2015-08-04 04:08 GMT
ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెడతాం. ఆయన అన్నీ చూసి.. పరీక్షలు చేసి.. చివరకు ఒక చిట్టీ (ప్రిస్కిప్షన్) చేతిలో పెడతారు. తాను రాసిచ్చిన మందుల్ని జాగ్రత్తగా వాడాలని చెబుతారు. ఆసక్తిగా.. ఆయనేం రాశారో చదువుదామని ప్రయత్నిస్తే ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు.  నాలుగు గీతలు గీసేసి ఉంటారు.

మళ్లీ అదే చిట్టీని మందుల షాపు అతని చేతిలో పెడితే.. చప్పున మందులు తీసి ఇచ్చేస్తాడు. అంతా బాగుంది కానీ.. ఆ గీతల్ని లెక్క వేయటంలో ఏదైనా పొరపాటు దొర్లితే..? దానికి బాధ్యత ఎవరిది? ఇలాంటి ఆలోచన మనసులోకి వచ్చిన వెంటనే పెద్ద షాక్ తగిలినట్లు అవుతుంది. మరి.. ఇంత కాలం ఇలాంటి సమస్య రాలేదా? ఎవరు బాధితులుగా మారలేదా? అంటే.. చాలానే ఉదంతాలు ఉన్నాయి.

కానీ.. ఎవరు పట్టించుకోలేదు. అలా నడిచిపోయింది. కానీ.. ఒక తెలుగు వ్యక్తి ఇలాంటి ఉదంతం ఒకటి పేపర్లో చదివిన వార్త కదిలించేసింది. డాక్టర్ రాసిన రాతను అర్థం చేసుకోవటంలో జరిగిన పొరపాటు కారణంగా.. ఢిల్లీ దగ్గర్లోని నొయిడాలో మూడేళ్ల చిన్నారి మృత్యుపాలు కావటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. డాక్టర్ల రాతను మార్చాలన్న కంకణం కట్టుకోవటమే కాదు.. దాని కోసం అలుపెరగని పోరాటం చేసి.. అనుకున్నది సాధించే చివరి దశలో ఉన్నాడు.

డాక్టర్ల రాతను మార్చేందుకు చట్టబద్ధమైన నిబంధనలు వచ్చేలా చేయటంలో దాదాపు విజయవంతం అయ్యారనే చెప్పాలి. ఇంకా సాంకేతిక అంశాలు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మందుల షాపు యజమాని చిలుకూరి పరమాత్మ. పేపర్లో చదవి.. తీవ్ర ప్రభావానికి గురైన ఈ 48 ఏళ్ల మందుల షాపు యజమాని.. నొయిడాలోని చిన్నారికి జరిగిన లాంటిదే మరొకరికి జరగకూడదన్న ఉద్దేశ్యంతో పోరాటం చేసి.. కేంద్ర ఆరోగ్య మంత్రి పదేపదే విన్నవించినా ఫలిలం తేదు.

దీంతో.. హైకోర్టుకు వెళ్లిన ఆయనకు.. దీనిపై చట్టం చేయలేమని కేంద్రాన్ని చెప్పలేమని.. కాకపోతే.. దీని గురించి ఆలోచించాలని ఎంసీఐకి సూచించింది. హైకోర్టు సూచనపై స్పందించిన ఎంసీఐ.. డాక్టర్ల చేతి రాత పెద్ద అక్షరాలతోనే రాయాలన్న  ప్రతిపాదనను చేస్తూ.. కేంద్రానికి పంపింది. దీనిపై 2014 డిసెంబరులో పార్లమెంటులో ఆరోగ్య శాఖా మంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తుదిగా.. దీనిపై తగిన సూచనలు చేయాలని ఆగస్టు 17లోపు గడువు విధించారు. త్వరలో డాక్టర్ల చేతిరాత మారటమేకాదు.. పెద్ద అక్షరాల్లోనే చిట్టీలు రాసే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పక తప్పదు. నాకెందుకు అనుకోకుండా.. అలుపెరగకుండా అందరి కోసం పోరాడుతున్న పరమాత్మకు థ్యాంక్స్ చెబుదామా..?
Tags:    

Similar News