వైర‌ల్ ఆడియోః గుండెలు బరువెక్కిస్తున్న‌ సీపీ మాట‌లు!

Update: 2021-04-30 15:30 GMT
''ఎవ‌రు ఏమైపోయినా ప‌ర్వాలేదు.. చివ‌ర‌కు చ‌చ్చిపోయినా ప‌ర్వాలేదు.. నేను బాగుంటే చాలు.. ఆ త‌ర్వాత నావాళ్లు బాగుంటే చాలు.'' ఇదీ.. చాలా మంది మ‌నుషుల స్వభావం. క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న ఇలాంటి ప‌రిస్థితుల్లో.. ఇలాంటి ఆలోచ‌నా విధానం మ‌రింత‌గా పెరిగిపోవ‌డంతో.. ఎంతో మంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విష‌యాన్ని నాలుగు మాట‌ల్లో అర్థం చేయించిన హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌.. కొంద‌రి చెంపలు చెళ్లు మ‌నిపించారు.

కొంద‌రు డ‌బ్బున్నోళ్లు కొవిడ్ సోక‌గానే.. ల‌క్ష‌ణాలు లేక‌పోయినా ఆసుప‌త్రుల్లో చేరి బెడ్లు దొర‌క్కుండా చేస్తున్నార‌ని, దీనివ‌ల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌వారికి ప‌డ‌క‌లు దొర‌క‌ట్లేద‌ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌న్ కుమార్ అన్నారు. చివ‌ర‌కు అభాగ్యులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నార‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తంచేశారు. అందువ‌ల్ల బెడ్లు అవ‌స‌రం లేనివారు మాన‌వ‌త్వంతో ఆలోచించి, ఆసుప‌త్రి నుంచి ఇళ్ల‌కు వెళ్లిపోవాల‌ని కోరారు. ఈ మేర‌కు ఆయ‌న మాట్లాడిన ఆడియోను త‌న ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు. ఇందులో రెండు ఉదాహ‌ర‌ణ‌లు చెప్పారు.

''ఇటీవ‌ల నాగ్ పూర్ లో నారాయ‌ణ్ ద‌భోల్క‌ర్ అనే వృద్ధుడు కొవిడ్ తో ఆసుప‌త్రిలో చేరారు. అదే స‌మ‌యంలో మ‌రో యువ‌కుడికి బెడ్ అవ‌స‌ర‌మైంది. దీంతో.. నేను జీవితంలో అన్నీ అనుభ‌వించాను. జీవించే హ‌క్కు నాక‌న్నా.. యువ‌కుల‌కే ఎక్కువ‌గా ఉందని భావించిన ద‌భోల్క‌ర్‌.. త‌న బెడ్ అత‌నికి అప్ప‌గించి, ఇంటికి వెళ్లిపోయారు. మూడు రోజుల త‌ర్వాత ప్రాణాలు విడిచారు.'' అని చెప్పారు.

మరో ఉదాహ‌ర‌ణ‌లో ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత లియో టాల్ స్టాయ్ మాట‌ల‌ను కోట్ చేశారు. ''నువ్వు నొప్పి, బాధను అనుభవిస్తున్నావంటే జీవించి ఉన్నావ‌ని అర్థం. అదే.. ఇత‌రుల నొప్పిన అర్థం చేసుకోగ‌లుగుతున్నావంటే నువ్వు మ‌నిషివ‌ని అర్థం'' అని చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సీపీ చెప్పిన మాట‌ల‌కు ఫిదా అయిన నెటిజ‌న్లు.. ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

https://twitter.com/CPHydCity
Tags:    

Similar News