మునుగోడుపై అంద‌రూ అందరే.. జ‌నాల టాక్ ఏంటంటే!!

Update: 2022-10-31 03:59 GMT
తెలంగాణ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం మూడు కీల‌క విష‌యాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ఒక‌టి ఎమ్మెల్యేల ఫిరాయింపులు(కేసీఆర్ భాష‌లో కొనుగోళ్లు), రెండు ఫ్లోరోసిస్ స‌మ‌స్య‌, మూడు మునుగోడు డెవ‌ల‌ప్‌మెంట్‌. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక నేప‌థ్యంలో అధికార టీఆర్ ఎస్, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీజేపీ నేత‌ల మ‌ధ్య ఈ మూడు కీల‌క అంశాల‌పై నే ర‌గ‌డ సాగుతోంది. మొత్తంగా గ‌త నాలుగు రోజులుగా జ‌రుగుతున్న మాట‌ల‌యుద్ధం కానీ, కౌంట‌ర్ ఎటాక్‌ల‌ను కానీ గ‌మ‌నిస్తే.. ఈ మూడు విష‌యాల చుట్టూ తిరుగుతోంది. దీనిపై నువ్వే దొంగ అంటే.. నువ్వే దొంగ అని రెండు పార్టీలూ నిందించుకుంటున్నాయి. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి మ‌రీ ప‌ర‌స్ప‌రం తిట్టుకుంటున్నాయి.

ఇప్పుడు ఆ మూడు విష‌యాల్లో ఈ రెండు పార్టీల‌కు సంబంధించి ఎవ‌రు శుద్ద పూస‌.. అనేది చూస్తే.. తొలి స‌మ‌స్య ఫిరాయింపులు. ఈ ఫిరాయింపులు అనే మాట ఎలా క‌నిపెట్టారో తెలియ‌దు కానీ.. తెలంగాణ‌లో దీనిని ప్రారంభించింది మాత్రం కేసీఆరే! తొలి, మ‌లి ప్ర‌భుత్వాల్లో ఆయ‌న ఇత‌ర పార్టీల నుంచి అభ్య‌ర్థుల‌ను తీసుకోలేదా?  అంటే.. తీసుకున్నారు. క‌మ్యూనిస్టు పార్టీ నేత‌ల‌ను కూడా త‌న‌వైపు తిప్పుకోగ‌లిగిన నాయ‌కుడిగా కేసీఆర్ త‌న స‌త్తా చూపించారు. వాస్త‌వానికి క‌మ్యూనిస్టులు అంత పెద్ద‌గా లొంగ‌రు. అలాంటి వారిని కూడా త‌న‌వైపు తిప్పేసుకున్నారు. నోముల న‌ర‌సింహ‌య్య ఈ జాబితాలో నాయ‌కుడే. ఇక‌, కాంగ్రెస్ త‌ర‌ఫున 2018లో గెలిచిన వారికి మంత్రిప‌ద‌వులు ఇచ్చారు. స‌బితా ఇంద్రారెడ్డి నిద‌ర్శ‌నం.

ఇక‌, బీజేపీ మాత్రం త‌క్కువ తిందా?  టీడీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన వారిని కేంద్రంలో కండువా క‌ప్పి  పార్టీలో చేర్చుకోలేదా? అప్ప‌టి వ‌ర‌కు సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌, టీజీ వెంక‌టేష్ వంటివారిపై జ‌రిగిన ఐటీ దాడులు, ఈడీ దాడులు త‌ర్వాత ఆగిపోలేదా?  ఇక‌, ఇక్క‌డ మాత్రం త‌క్కువ తిన్న‌ది లేదు. ర‌ఘునంద‌న‌రావును తీసుకున్నారు. ఈట‌లకు కండువా క‌ప్పారు(ఇది కొంత ఆలోచించాల్సిందే).సో.. ఎవ‌రూ త‌క్కువ కాదు. ఫిరాయింపుల విష‌యాన్ని ప్ర‌స్తావించి.. ప్ర‌జ‌ల ముందు న‌వ్వుల పాల‌వ‌డం త‌ప్ప‌!! ఇక‌, ఎవ‌రు ఎవ‌రిని చేర్చుకున్నా 'ఊర‌క‌రారు' అన్న‌ట్టుగా ఎంతో కొంత లాభం ఉండే ఉంటుంది!!

ఇక‌, ఫ్లోరైడ్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేద‌ని సీఎం కేసీఆర్ మోడీపై విరుచుకుప‌డుతున్నారు. వాజ‌పేయి హ‌యాంలో తాము ప్ర‌తిపాదించినా ప‌క్క‌న పె్ట్టార‌ని అన్నారు. స‌రే.. అస‌లు.. కేంద్ర మంత్రి ఉన్న స‌మ‌యంలో కేసీఆర్ ప‌రిష్క‌రించొచ్చుక‌దా! అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు. పోనీ.. ఎనిమిదిన్న‌రేళ్ల బంగారు తెలంగాణ‌లో ఏం చేశారు?  యాదాద్రికి 100 కోట్ల చొప్పున ఇచ్చిన కేసీఆర్‌.. ఈ స‌మ‌స్య‌ను ఎందుకు విస్మ‌రించారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చాయి క‌నుక ఈ స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింది. లేక‌పోతే.. ఏమ‌య్యేది? అనేది కూడా స‌మాధానం లేని ప్ర‌శ్నే. ఇక‌, ఇదే విష‌యంలో బీజేపీ నేత‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఎదురు దాడి త‌ప్ప‌.. ఇత‌మిత్థంగా ఇది చేశాం అని చెప్పుకోలేని ప‌రిస్థితి.

మోడీ 800 కోట్లు ఇచ్చార‌ని చెబుతున్నారు. ఇది దేశం మొత్తానికి ఇచ్చిన లెక్క త‌ప్ప‌. కేవలం న‌ల్ల‌గొండ‌కు ఇవ్వ‌లేదు. సో.. ఇది కూడా రెండు పార్టీలు అరుచుకుని.. యాగీ చేసుకునేందుకు వాడుతున్న రాజ‌కీయ విన్యాస‌మే. మ‌రో స‌మ‌స్య మునుగోడు అభివృద్ధి. బీజేపీ ప‌ట్టించుకుంటుందా?  రాజీనామా చేసిన రాజ‌గోపాల్ ప‌ట్టించుకుంటాడా?  గాడిద‌ల‌కు గ‌డ్డేసి.. ఆవు ద‌గ్గ‌ర పాలు ఎలా పితుకుతారు? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు.

అంటే.. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ అధికార పార్టీని గెలిపిస్తేనే ప‌నులు చేస్తామ‌నే సంకేతాలు ఇస్తున్నారా?  ఇదే ప్ర‌జాస్వామ్యం అనే ఎద‌రు ప్ర‌శ్న‌లు అప్పుడే వ‌చ్చేస్తున్నాయి. అస‌లు రాజ‌గోపాల్ రాజీనామాకు కార‌ణం కూడా.. ప‌నులు చేయ‌లేక‌పోతున్నాన‌ని.. ప్ర‌ష‌భుత్వం నిధులు ఇవ్వ‌డం లేద‌నే క‌దా!! త‌ర్వాత కార‌ణం 1800 కోట్లు. ఇక‌, బీజేపీ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ జెండా ఎగ‌ర‌లేదు. ఇప్పుడు చేస్తామ‌ని చెబుతున్నారు. సో.. ఎలా చూసుకున్నా ఈ వితండ వాద రాజ‌కీయాలు ప్ర‌జ‌ల చెవుల్లో పువ్వులు పెట్ట‌డానికే త‌ప్ప‌.. ప్ర‌యోజ‌నం ఉందా? అనేది సామాన్యుడి మాట‌!!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News