ఆకాశం బద్దలు.. హైదరాబాద్ లో భారీ వర్షం

Update: 2020-09-16 17:33 GMT
హైదరాబాద్ లో ఈ సాయంత్రం ఒక్కసారి భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కుండపోతగా కురిసింది. నల్లటి మేఘాలు కమ్ముకొని ఒక్కసారిగా ఉధృతంగా వాన పడింది. ఉదయం ఎండ తీవ్రంగా కాసింది. సాయంత్రానికి వాతావరణం మారిపోయి కుంభవృష్టి కురిసింది.

హైదరాబాద్ లో కుండపోత వానకు తోడుగా ఉరుములు, మెరుపులతో ఆకాశం పెల్లుమంది. పిడుగులు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. చెవులు చిల్లులు పడే శబ్ధాలతో పిడుగులు పడ్డాయి.

భారీగా కురిసిన వర్షాలతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. వరద కాలువలను తలపించాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, మియాపూర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కూకట్ పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై నడుం లోతు నీరు చేరి ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయింది.

బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. దీంతో మరింత బలపడి భారీ వర్షాలు తెలంగాణలో కురుస్తున్నాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావం రెండు మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
Tags:    

Similar News