3 గంటల వానతో హైదరాబాద్ మహానగరి ఉక్కిరిబిక్కిరి

Update: 2021-09-03 03:20 GMT
ఆకాశానికి చిల్లు పడినట్లు.. మేఘాలు ముక్కలైనట్లుగా చోటు చేసుకున్న వాన హైదరాబాద్ మహానగరాన్ని ముంచేసింది. గురువారం సాయంత్రం ఏడున్నర గంటల నుంచి పదిన్నర గంటల వరకు కురిసిన భారీ వానతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కొన్ని చోట్ల రాత్రి 8 గంటలకు మొదలైన వర్షం రాత్రి 11 గంటల వరకు సాగుతూనే ఉంది. ఉరుము.. మెరుపు లేనట్లుగా ఒక్కసారిగా విరుచుకుపడిన వానతో నగరజీవి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ మునిగిపోవటమే కాదు.. పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితి.  

మూడు గంటల వ్యవధిలో ఒక్క జూబ్లీహిల్స్ ప్రాంతంలో అత్యధికంగా 9.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీగా కురిసిన వర్షానికి రోడ్లు మొత్తం జలమయం కావటమే కాదు.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. సాయంత్రం అప్పుడప్పుడే ఇళ్లకు బయలుదేరిన వారికి చుక్కలు చూపించిన వర్షంలో కొంత ఉపశమనం కలిగించేది ఐటీ కారిడార్ మొత్తం వర్కు ఫ్రం హోం కావటం. ఒకవేళ.. ఇక్కడ కానీ ఆఫీసులు పని చేసి ఉంటే.. నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా పరిచయమై ఉండేది.

వర్ష తీవ్రత కారణంగా ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిన వాహనాలు కూకట్ పల్లికి చేరుకోవటానికి ఏకంగా రెండున్నర గంటల  సమయం పట్టిందంటే.. పరిస్థితి తీవ్రత ఎంతన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయి రోడ్ల మీద నిలిచిపోయిన పరిస్థితి. రోడ్ల మీద పెద్ద ఎత్తున నిలిచిన నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ అత్యవసర విభాగం ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు.

హైదరాబాద్ లోని మెహదీపట్నం.. రాజేంద్రనగర్.. దిల్ సుఖ్ నగర్.. పంజాగుట్ట.. ఖైరతాబాద్.. అమీర్ పేట.. కూకట్ పల్లి.. మాదాపూర్.. శేరిలింగం పల్లి.. హైటెక్ సిటీ.. జూబ్లీహిల్స్.. శ్రీనగర్ కాలనీ.. యూసఫ్ గూడ.. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో నగరంలోని అన్ని వైపులా విరుచుకుపడిన వర్షానికి నగర జీవి అతలాకుతలమయ్యారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోగా.. ఇళ్ల్లల్లోకి భారీగా వర్షం వచ్చి చేరింది. పల్లపు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. క్రిష్ణానగర్ ప్రాంతంలోని పలు ఆటోలు.. టూవీలర్స్.. తోపుడుబండ్లు వర్షపునీటి తాకిడికికొట్టుకుపోయిన పరిస్థితి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

అత్యధికంగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే.. రెండో స్థానంలో అల్లాపూర్ 8.8 సె.మీ, మూడో స్థానంలో మాదాపూర్ 8.3సె.మీ., మోతీనగర్ లో 7.9సె.మీ, యూసఫ్ గూడలో 7.6 సె.మీ వర్షం కురిసింది. తక్కువగా వర్షం కురిసిన ప్రాంతం ఏమిటన్నది చూస్తే కేపీహెచ్ బీ, ఆసిఫ్ నగర్, గాజులరామారం ప్రాంతాల్లో 5.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందంటే.. వాన తీవ్రత ఎంత ఎక్కువ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News