చెన్నైకు చుక్కలు చూపిస్తున్న వరుణదేవుడు

Update: 2022-01-01 14:30 GMT
నెల క్రితం.. భారీగా కురిసిన వర్షంతో తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరం ఎంతలా తల్లడిల్లిపోయిందో తెలిసిందే. పెద్ద ఎత్తున చెన్నై వాసులకు కష్టం కలిగించిన కుండపోత వర్షాన్ని మర్చిపోక ముందే.. మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చెన్నై మీద చూపించాడు. విడవకుండా కురుస్తున్న జోరు వర్షంతో చెన్నై మహానగరం వణుకుతోంది. గంటల తరబడి కురుస్తున్న వాన.. తమిళుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

భారీగా కురుస్తున్న వర్షంతో వరద నీరు పోటెత్తి చెన్నైలోని మూడు సబ్ వేల నుంచి రాకపోకల్ని అధికారులు నిలిపివేశారంటే.. వర్షపు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందన్న విషయం ఇట్టే తెలిసేలా చేస్తోంది. చెన్నైతో పాటు.. తిరువళ్లూరు.. కాంచీపురంతో సహా ఇతర ప్రాంతాల్ని వర్షం విడవటం లేదు. చెన్నైలోని టి.నగర్ లో కురిసిన వర్షానికి శుక్రవారం ఉదయానికే మోకాలు లోతు వాన నీరు రోడ్డు మీద నిలిచిపోయింది. దీంతో.. ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.

భారీగా కురుస్తున్న వానతో నగరంలోని కొన్ని రోడ్లను మూసివేస్తే.. మరికొందరు విడవకుండా కురుస్తున్న వర్షంతో.. వాన నీరు ఇళ్లల్లోకి వస్తుండటంతో.. ఇంట్లోకి నీళ్లు రాకుండా ఉండేందుకు ఇసుక బస్తాల్ని అడ్డుగా వేసుకోవటం కనిపించింది. భారీ వర్షంతో రోడ్ల మీద వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గురువారం దాదాపుగా ఆరు గంటల పాటు వాన పడితే.. శుక్రవారం సైతం వర్షం విడవలేదు. దీంతో.. ఆఫీసులకు వెళ్లే వారు.. ఇతర పనులకు బయటకు వెళ్లే వారు.. వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని.. వాతావరణ నిపుణులు చెబుతున్న వేళ.. చెన్నై వాసులు వణికిపోతున్నారు. ఇటీవల కాలంలో తరచూ కురుస్తున్న భారీ వర్షం కారణంగా చెన్నై మహానగరంలోని ప్రజలు పెద్ద ఎత్తున అవస్థలు పడుతున్నారు. వారి సమస్యలల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించటమే కాదు.. వాటిని ప్రణాళిక బద్ధంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎన్నో అంచనాలున్న స్టాలిన్ ప్రభుత్వ హయాంలోనే.. ఈ ఇష్యూకు చెల్లుచీటి పడుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఇష్యూ మీద ఎలా రియాక్టు అవుతారో చూడాలి.


Tags:    

Similar News