వర్షంతో కొందరికి హర్షం..మరి కొందరి కష్టం ఇలా!

Update: 2019-08-22 14:30 GMT
ఎగువన కురిసిన వర్షాలతో దిగువ ప్రాంతాలు ఆనందంగా ఉన్నాయి. కృష్ణ - కావేరి వంటి నదులు పొంగిపొర్లడంతో వాటి దిగువన ఉన్న ప్రాంతాలు ఆనందంగా ఉన్నాయి. అయితే నదుల జన్మస్థానాల్లోని ప్రజలు మాత్రం ఇక్కట్ల పాలయ్యారు. కర్ణాటకలో అలాంటి బాధితుల సంఖ్య గణనీయంగా ఉంది.

భారీ వర్షాలు - ప్రవాహం కారణంగా కర్ణాటక రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఉత్తర కర్ణాటకలో వర్షంతో పాటు వరదలు తగ్గుముఖం పట్టాయి. అయితే కరావళి - మలెనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన నష్టమే లెక్కల్లో చిక్కడం లేదు. ఉత్తర కర్ణాటక వ్యాప్తంగా సుమారు రూ.50 వేల కోట్ల నష్టం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. అయితే కేవలం కొడగు జిల్లాలోనే రూ.700 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వరుణుడు విరామం ప్రకటిస్తే కానీ.. లెక్కలు అంచనా వేయలేని పరిస్థితి. భారీ వర్షాల కారణంగా మడికెరె - చిక్కమగళూరు జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు చోట్ల కొండచరియలు విరిగి పడటంతో రోడ్లు వాహనాల సంచారానికి పనికి రాకుండా పోయాయి. బెళగావి - భాగల్‌ కోటె - రాయచూరు - విజయపుర - ధారవాడ జిల్లాల్లో వర్షం తగ్గుముఖం పట్టింది. ఈనేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నేలకూలిన ఇళ్లను యజమానులు సందర్శిస్తున్నారు. వందల సంఖ్యలో కార్లు - బైకులు తదితర వాహనాలు కొట్టుకుపోయాయి. కొడగు జిల్లాలో 158 ఇళ్లు కూలిపోయాయి. చిక్కమగళూరు జిల్లాలోని దత్తాత్రేయ - ముళ్లయనగిరి సమీపంలో కొండచరియలు విరిగి పడటంతో ఈనెల 30వ తేదీ వరకు వాహనాల సంచారం బంద్‌ చేశారు.
 
ప్రవాహ పీడిత కొడగు జిల్లాలో భారీ వర్షాల కారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆస్తినష్టం - ప్రాణనష్టం సంభవించడంతో జిల్లా ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కొడగు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.700 కోట్ల నష్టం సంభవించిందని జిల్లా అధికారి అనీస్‌ కణ్మణి జాయ్‌ తెలిపారు. గురువారం ఆమె కొడగు జిల్లా కేంద్రంలో ప్రవాహం కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులతో సమావేశమయ్యారు. సభలో ప్రవేశపెట్టిన నివేదికల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 158 ఇళ్లు కూలిపోయాయి. ఇల్లు సంపూర్ణంగా కూలిపోయిన వారికి తక్షణ పరిహారంగా రూ.లక్ష ప్రకటించారు. అదేవిధంగా నిరాశ్రయులు జీవించేందుకు జిల్లా వ్యాప్తంగా 4 వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రవాహాల్లో చిక్కుకుని అదృశ్యమైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొండచరియలు విరిగి పడి రోడ్లలో వాహనాల సంచారానికి అంతరాయం ఏర్పడిన చోట్ల జేసీబీ యంత్రాలతో పనులు సాగుతున్నాయి.
 
మడికెరె తాలుకా కట్టెమాడు గ్రామంలో నాలుగు వివాహాలు రద్దు అయ్యాయి. భారీ వర్షాలకు ఆస్తి కోల్పోయి నిరాశ్రయులు కావడంతో పరిస్థితి ఎదురైందని వాపోయారు. మడికెరె తాలుకా కట్టెమాడు గ్రామంలో ఇటీవల నాలుగు కుటుంబాల్లో పెళ్లి కళ వచ్చింది. ఈమేరకు నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా కావేరి నదీ ఉధృతంగా ప్రవహించడంతో ఇళ్లలో దాచుకున్న ధనం - ధాన్యం కూడా నీళ్లపాలయ్యాయి. ఈక్రమంలో వివాహ నిమిత్తం తెచ్చి పెట్టుకున్న బంగారు ఆభరణాలు కూడా కొట్టుకుపోయాయి. ఫలితంగా ప్రస్తుతం వివాహం చేయలేక నిరాశ్రయులుగా మారారు. గ్రామానికి చెందిన రేవతి - రేష్మా - ప్రిన్సి - లతేశ్‌ కు ఇటీవల నిశ్చితార్థమైంది. వరదల కారణంగా వివాహలు రద్దు చేశారు.

అంకెల్లో...

ప్రవాహ పీడిత తాలుకాలు – 103
మృతుల సంఖ్య – 61 మంది
అదృశ్యమైన వారు – 16 మంది
మృతి చెందిన పశువులు – 859
దెబ్బ తిన్న ఇళ్లు – 58,620
పంట నష్టం– 4,69,658 హెక్టార్లు
అందిన పరిహారం – ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు రూ.4.09 కోట్లు విరాళంగా వచ్చింది.


Tags:    

Similar News