భారీ వర్షాల వేళ హైదరాబాద్ మెట్రోకు ఈ తాకిడీ ఏంటి?

Update: 2022-07-12 11:30 GMT
గత ఐదురోజులుగా నిరంతరం కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ స్తంభించిపోయింది. నగరం మొత్తం జల ప్రళయంలో చిక్కుకుంది. రోడ్లన్నీ తటాకాలను తలపిస్తున్నాయి. ఎక్కడ కాలు పెడితే ఎక్కడ మునిగిపోతామోనని ప్రయాణికులంతా భయపడిపోతున్నారు.  ఇక భారీ వర్షాలతో బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు నడవడం లేదు. ఎంఎంటీఎస్ రైలు సేవలు కూడా నిలిచిపోయాయి.  పలు రైళ్లు రద్దయ్యాయి.

దీంతో ప్రయాణికులు ఇప్పుడు తమకు ఆకాశమార్గాన ఉన్న ఏకైక హైదరాబాద్ మెట్రోపై పడుతున్నారు. ఉద్యోగులు,ప్రజలు ఇలా అందరూ మెట్రోల్లోనే ప్రయాణిస్తున్నారు. దీంతో మెట్రోకు తాకిడి ఎక్కువైంది. ప్రయాణికులు పోటెత్తడంతో మెట్రో స్టేషన్లు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి.

ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఎంఎంటీఎస్ సేవలు నిలిచిపోవడంతో హైదరాబాద్ మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లు సరిపోవడం లేదు. కిక్కిరిసి నడుస్తున్నాయి. ప్రయాణికులు ఎక్కువసేపు మెట్రో స్టేషన్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

మెట్రో అధికారులు మరిన్ని రైళ్లను అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. లేదంటే ఆఫీసులకు, ఇళ్లకు చేరుకోవడం ఆలస్యమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీ వర్షాల కారణంగా కొన్ని కంపెనీలు వర్షాల కారణంగా వర్క్ ఫ్రం హోం అనుమతిస్తున్నాయి. మూడు రోజుల పాటు ఇప్పటికే స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది అధికార యంత్రాంగం. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలతో అంతా అతలాకుతలం అవుతోంది.

కాగా దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో  ఉన్న అల్పపీడనం ఈరోజు తీవ్ర అల్పపీడనంగా బలపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈరోజు అత్యంత భారీ, రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.
Tags:    

Similar News