నిజామాబాద్ ఎన్నిక‌ల ఏర్పాట్ల‌కు హెలికాఫ్ట‌ర్?

Update: 2019-04-04 04:04 GMT
తిండి పెట్టే రైత‌న్న కాస్త క‌న్నెర్ర చేస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న విష‌యం తాజాగా జ‌రుగుతున్న నిజామాబాద్ ఎంపీ ఎన్నిక‌ను చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. అధికారం చేతిలో ఉన్నా త‌మ స‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకోని ప్ర‌భుత్వానికి చుక్క‌లు చూపించేందుకు వారు ఎన్నుకున్న మార్గం ఎన్నిక‌ల సంఘానికి చుక్క‌లు చూపించ‌ట‌మే కాదు చెమ‌ట‌లు పట్టిస్తోంది. దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో నిజామాబాద్ ఎన్నిక‌ల బ‌రిలో 185 మంది అభ్య‌ర్థులు రంగంలోకి దిగ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లుగా ఏర్పాట్లు చేసేందుకు ఎన్నిక‌ల సంఘం యుద్ధ ప్రాతిప‌దిక‌న ఏర్పాట్లు చేస్తోంది.

పాతిక‌.. యాభై మంది వ‌ర‌కూ ఓకే కానీ.. అంత‌కు  మించి అభ్య‌ర్థులు పోటీలో ఉంటే అధికారుల‌కు ఇబ్బందులే. ఎన్నిక‌ను నిర్వ‌హించ‌టం చాలా క‌ష్ట‌మ‌వుతుంది. అలాంటిది 185 మంది పోటీలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ఏర్పాట్లు అంటే మాట‌లు కాదు. ఈ ఎన్నిక నిర్వ‌హ‌ణ క‌ష్టం కావ‌టంతో.. దాన్ని అధిగ‌మించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భారీగా బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల నేప‌థ్యంలో ఎన్నిక నిర్వ‌హించ‌టానికి అవ‌స‌ర‌మైన సామాగ్రిని త‌ర‌లించేందుకు ఏకంగా హెలికాఫ్ట‌ర్ ను వినియోగించాల‌ని డిసైడ్ అయ్యారు.

అంతేనా.. వివిధ రాష్ట్రాల నుంచి 25వేల ఈవీఎంలు.. వంద‌లాది ఇంజినీర్లు రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి ప్ర‌త్యేకంగా అధికారులు నిజామాబాద్ కు చేరుకున్నారు. ఇక‌.. వారి రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం హెలికాఫ్ట‌ర్ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో ఉప‌యోగించే ఈవీఎంల‌ను ప‌రీక్షించేందుకు బెంగ‌ళూరు.. చెన్నై.. హైద‌రాబాద్ ల నుంచి 750 మంది ఇంజినీర్లు నిజామాబాద్ కు రావాల్సి వ‌చ్చింది. ఇక‌.. పోలింగ్ సంద‌ర్భంగా ప‌ని చేసే సిబ్బందికి ప్ర‌త్యేకించి శిక్ష‌ణ ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని భారీగా నిర్వ‌హిస్తున్నారు.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించే పోలింగ్ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు ప్ర‌త్యేకంగా ఢిల్లీ నుంచి ఎన్నిక‌ల సంఘం డిప్యూటీ క‌మిష‌న‌ర్ సుదీప్ జైన్ లాంటి పెద్దోళ్లు కూడా రంగంలోకి దిగారు. నిజామాబాద్‌కు ప్ర‌త్యేకంగా వ‌చ్చిన ఆయ‌న ఎన్నిక‌ల ఏర్పాట్లను ఆయ‌న ప్ర‌త్యేకంగా స‌మీక్షించారు. నిజామాబాద్ ఎన్నిక ఇప్పుడో రికార్డుగా మారుతుంద‌ని చెబుతున్నారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఎం-2 ర‌కం ఈవీఎంల‌ను మాత్ర‌మే ఉప‌యోగించి 4 బ్యాలెట్ యూనిట్ల‌తో మాత్ర‌మే ఎన్నిక‌ల్ని నిర్వ‌హించార‌ని.. తొలిసారి ఎం-3 ర‌కం ఈవీఎంల‌తో 12 బ్యాలెట్ యూనిట్ల ద్వారా ఎన్నిక‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ ఎన్నిక నిర్వ‌హించ‌టం చారిత్రాత్మ‌క క్ర‌తువుగా అభివ‌ర్ణించ‌టం చూస్తే.. అన్నదాత‌కు ఆగ్ర‌హం వ‌స్తే వ్య‌వ‌స్థ ఎంత‌లా ఉరుకులు పరుగులు పెట్టాల్సి వ‌స్తుందో అన్న దానికి ఇదో నిద‌ర్శ‌కంగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News