'హలో కేటీఆర్ ఫ్రెండ్.. హైదరాబాద్ ఎట్లుందో చూడు'

Update: 2022-07-16 05:34 GMT
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సగటు జీవుల్లోని క్రియేటివిటీకి కోట్లాది మంది ఫిదా అయిపోతున్నారు. అదే సమయంలో వారు టార్గెట్ చేసిన ప్రముఖులకు (రంగం ఏదైనా సరే) తడిచిపోతోంది. ఇలాంటి క్రియేటివ్ జీనియస్ దెబ్బకు గింగిరాలు ఎత్తే పరిస్థితి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. చూసినంతనే.. ఇట్టే కనెక్టు అయిపోవటమే కాదు.. మంత్రి కేటీఆర్ వారి ఫ్రెండ్ కు సరైన సమాధానం ఇవ్వటమే కాదు.. చిన్న బాసు వారు సైతం తల పట్టుకునేంతలా ఉన్న ఈ వీడియో గురించి కాసేపు మాట్లాడుకోవాల్సిందే. ఇప్పుడున్న బిజీ జీవితంలో రెండు నిమిషాలు కేటాయించి మరీ వీక్షించాల్సిందే.

ఇంతకీ విషయం ఏమంటే.. ఆ మధ్యన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఏపీలోని రోడ్ల గురించి ప్రస్తావించిన మంత్రి కేటీఆర్.. తన స్నేహితుడు తనకు చెప్పినట్లుగా చెప్పి కలకలం రేపారు. హైదరాబాద్ గొప్పతనాన్ని చాటి చెప్పుకోవటానికి ఏపీకి.. అక్కడి జగన్ ప్రభుత్వానికి ఊహించనిరీతిలో తన మాటలతో షాకులు ఇచ్చిన కేటీఆర్ మాటలు.. ఎంతటి రాజకీయ మంటలకు కారణమైందో తెలిసిందే. అంతేకాదు.. తన మాట తీరుకు ఎప్పుడు వివరణ ఇవ్వని కేటీఆర్.. ఆ సందర్భంలో మాత్రం రాత్రి అయ్యేసరికి తాను అన్న మాటల మీద వివరణ ఇచ్చే పరిస్థితిని తెచ్చుకున్నారు.

పక్క రాష్ట్రానికి చెందిన తన ఫ్రెండ్ హైదరాబాద్ లో ఉంటారని.. సంక్రాంతి సందర్భంగా ఊరికి వెళితే.. అక్కడి రోడ్లకు బెదిరిపోవటమే కాదు.. మనోళ్లను బస్సుల్లో అక్కడికి పంపితే.. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ఏ రీతిలో పని చేస్తుందో ఇట్టే తెలుస్తుందన్న మంత్రి కేటీఆర్.. తాను గొప్పలు చెప్పటం లేదని వాస్తవం చెప్పానంటూ పేర్కొనటం తెలిసిందే.

కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాటల్ని యథాతధంగా బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తూ.. విజువల్ మాత్రం.. వరుస పెట్టి కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ లో ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని తెలియజేసేలా విజువల్స్ ప్లే చేశారు. వీటిల్లోని విజువల్స్ కొన్ని పాతవే అయినా.. హైదరాబాద్ లోని రోడ్లు కూడా ఏమంత సక్కగా లేవన్న విషయాన్ని చెప్పేశారు.

వీడియో చివర్లో.. మైహోం మంగళ దగ్గర ఉన్న రోడ్లను చూపిస్తూ.. ఈ రహదారుల మీద ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించిన వైనం అందరిని ఆలోచనల్లో పడేయటమే కాదు..పక్కనున్న రాష్ట్రం గురించి చెప్పినప్పుడు.. మనం సక్కంగా ఉండాలి కదా? అన్న మెసేజ్ కూడా ఈ వీడియో పంపిందని చెప్పాలి. అంతేకాదు. ఈ వీడియోతో కేటీఆర్ మనసు నొచ్చుకోకుండా ఉండాలన్న జాగ్రత్తలు తీసుకున్న వైనం కనిపిస్తుంది. వీడియో ప్లే అవుతున్న వేళ.. దాని మీద.. 'హలో కేటీఆర్ ఫ్రెండ్..

హైదరాబాద్ ఎట్లుందో చూడు' అన్న క్యాప్షన్ ను రన్ చేయటం అందరిని ఆకర్షిస్తోంది. ఏమైనా.. పల్లెత్తు మాట మీరకుండా.. విషయాన్ని సింఫుల్ గా.. సూటిగా చెప్పేసిన ఈ క్యూట్ వీడియోను ఒక్కసారి చూస్తే.. రెండు.. మూడుసార్లు చూడాలనిపించటం ఖాయం. కావాలంటే మీరు ట్రై చేయండి.

Full View


Tags:    

Similar News