ఇక పై పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి

Update: 2022-02-16 10:31 GMT
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. పైగా ద్విచక్ర వాహనాలే ఎక్కువ ప్రమాదాలకు గురికావడం గమనార్హం. ఈ ప్రమాదాలకు గురైన వారిలో బైక్ మీద ప్రయాణించే వారికే ప్రాణాపాయం అధికంగా ఉంటోంది. అందుకే ఇప్పటికే హెల్మెట్ ధరించే నియమాన్ని తప్పనిసరి చేశారు.

అయితే బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వెళ్తే ఇద్దరూ.. హెల్మెట్ తప్పకుండా ధరించాల్సిందే. మరి ఒకవేళ బైక్ పై పిల్లలు ఉంటే.. దీనిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చిన్నారులు సైతం హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు 1989 సెంట్రల్ మోటార్ వెహికిల్ చట్టానికి సరణలు చేసి... పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

ద్విచక్రవాహనాల మీద వెళ్లే చిన్నారులు హెల్మెట్ లు కచ్చితంగా ధరించాలనే కేంద్రం ఆదేశించింది. నాలుగేళ్లు పైబడిన చిన్నారులు వేసుకోవాలని సూచించింది. వారికి తగిన సైజుల్లో హెల్మెట్లు రూపొందించాలని హెల్మెట్ తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. పిల్లల భద్రత కోసం సేఫ్టే జీన్ ను కూడా తయారు చేయాలని సూచించింది. పిల్లలు సైజును బట్టి హెల్మెట్, సేఫ్టీ జీన్ ను రూపొందించనున్నారు. భద్రతా జీనుకు పట్టీలు ఉంటాయి. ఇవి భుజానికి తగిలించుకునేలా ఉంటాయి. వీటిని ధరించడం  డ్రైవర్ కు కూడా సురక్షితం.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం పిల్లల కోసం తయారు చేసే హెల్మెట్స్ ఖచ్చితంగా మన్నికైనవిగా ఉండాలని కేంద్రం సూచించింది. పిల్లల వయసుకు తగ్గట్లుగా నిపుణుల సలహాలు ఉపయోగించి తక్కువ బరువు హెల్మెట్‌ లను అధిక మన్నిక కలిగి ఉండే హెల్మెంట్స్ ను తయారు చేయాల్సిందిగా కంపెనీలకు కేంద్రం సూచనలు జారీ చేయడం జరిగింది.

ఇకపై నాలుగు సంవత్సరాలు దాటిన పిల్లలు తప్పనిసరిగా బైక్ పై తల్లిదండ్రులతో ప్రయాణించినా కూడా నిర్ణీత హెల్మెట్‌ లేదా సైకిల్‌ హెల్మెట్‌ ను వాడాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి మంచి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కనుక పెద్దలు తప్పనిసరిగా పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించేందుకు హెల్మెట్స్ ను వాడకం గురించి నేర్పించాల్సిన బాధ్యత ఉంది.

బైక్ పై ఇద్దరు వెళ్తున్న సమయంలో ఒక్కరే హెల్మెట్‌ ధరిస్తున్నారు. రెండవ వ్యక్తి కూడా హెల్మెట్‌ ధరించాలనే నిబందన ఉన్నా కూడా ఇంకా అదే అమలు అవ్వడం లేదు. దయా హృదయులు అయిన పోలీసులు పిల్లలకు హెల్మెట్‌ లేకుంటే పట్టించుకుంటారా అనేది అనుమానమే. ప్రభుత్వం మరియు జనాలు అంతా సీరియస్ గా ఉండి పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా హెల్మెట్‌ ను వాడినప్పుడు మాత్రమే సమాజంలో యాక్సిడెంట్‌ మరణాలు తగ్గుతాయి. కేంద్రం తీసుకు వచ్చిన ఈ కొత్త చట్టం ను వ్యతిరేకించకుండా అనుసరిస్తే అంతా బాగుంటుంది.
Tags:    

Similar News