ధీమా పెంచే హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సర్వేలో ఏముంది?

Update: 2020-09-19 02:30 GMT
కరోనా మహమ్మారి దెబ్బకు అంతా ఆగమాగమైపోతున్న వేళ.. కాస్తంత ఉపశమనం కలిగించే అంశాల్ని వెల్లడించింది హైదరాబాద్ మహానగరానికి చెందిన ఎన్జీవో హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్. వివిధ జిల్లాలకు చెందిన 400 మందితో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 1520 మంది కోవిడ్ రోగులతో మాట్లాడటంతో పాటు.. వారికి సంబంధించిన పలు వివరాల్ని సేకరించింది. తాము జరిపిన సర్వే వివరాల్ని తాజాగా వెల్లడించింది.

ఈ సర్వేలో అన్నింటి కంటే ఎక్కువగా ఊరటనిచ్చే అంశం ఏమంటే..కోవిడ్ బారిన పడుతున్న వారిలో దాదాపు 94 శాతం మంది ఇంట్లోనే ఉండి మందులు వాడి కోలుకుంటున్నట్లుగా తేల్చింది. కేవలం ఆరు శాతం మందికి మాత్రమే ఆసుపత్రి అవసరమవుతుందన్న విషయాన్ని వెల్లడించారు.  తమ సంస్థకు చెందిన ప్రతినిధులు.. ముందుగా తయారు చేసుకున్న ప్రశ్నాపత్రాన్ని కోవిడ్ పేషెంట్లతో ఫోన్లో మాట్లాడం ద్వారా సమాచారాన్ని సేకరించినట్లుగా వెల్లడించారు.

పాజిటివ్ గా తేలిన వారికి ప్రభుత్వం మందుల కిట్ అందిస్తోంది. అందులోని మందుల్ని వాడటం ద్వారా తాము వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నట్లుగా తెలిపినట్లు పేర్కొన్నారు. తాము సమాచారాన్ని సేకరించిన మొత్తం 1920 మందిలో కేవలం నలుగురు మాత్రమే పరిస్థితి విషమించి మరణించారని సర్వే రిపోర్టు వెల్లడించింది. గతానికి భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నట్లు చెబుతున్నారు.

గతంలో ఆక్సిజన్ బాగా అవసరమయ్యేదని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం కొవిడ్ తీవ్రత బాగా తగ్గిందని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. కోవిడ్ ప్రమాదం నుంచి బయటపడొచ్చన్న మాటను చెప్పింది. తాము సమాచారం సేకరించిన వారిలో వైరస్ లక్షణాలు ఉన్నవారు 38 శాతం మంది అయితే.. లక్షణాలు లేని వారు 62 శాతంగా పేర్కొన్నారు. ఇక.. రోగుల్లో అత్యధికులు 21 నుంచి 50 ఏళ్ల లోపు వారే కావటం గమనార్హం. ఇలాంటివారు 58 శాతంగా పేర్కొన్నారు. ఈ రిపోర్టు చూస్తే.. కనీస జాగ్రత్తలతో పాటు.. కాసింత అప్రమత్తంగా ఉంటే చాలు.. కోవిడ్ బారిన పడకుండా ఉండొచ్చన్న అభిప్రాయం కలుగక మానదు.
Tags:    

Similar News