రెండు రోజుల్లోనే కేసీఆర్ కు దెబ్బేశాడుగా!

Update: 2018-03-07 04:33 GMT
థ‌ర్డ్ ప్రంట్ కాదు..ఇదే మొయిన్ ఫ్రంట్ అవుతుందంటూ త‌న జాతీయ రాజ‌కీయాల ఎంట్రీ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ను మ‌ర్చిపోలేం.  తాను ఫ్రంట్ గురించి మాట్లాడిన నేప‌థ్యంలో ప‌శ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ త‌న‌కు ఫోన్ చేసి మాట్లాడిన‌ట్లుగా కేసీఆర్ చెప్ప‌టం మ‌ర్చిపోలేం. అదే స‌మ‌యంలో కొంద‌రు నేత‌లు త‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన‌ట్లుగా చెప్పుకున్నారు.

అయితే.. ఈ మాట‌ల్లో హ‌డావుడే త‌ప్పించి.. గ‌ట్టిగా నిల‌బ‌డే బ్యాచ్ క‌నిపించ‌ట్లేద‌న్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. మ‌మ‌తా త‌న‌కు ఫోన్ చేసిందంటూ కేసీఆర్ చెప్పిన మాట అబ‌ద్ధ‌మ‌ని.. ఆయ‌నే మ‌మ‌త‌కు ఫోన్ చేశార‌న్న విష‌యాన్ని జాతీయ ప‌త్రిక ఒక‌టి బ్రేక్ చేయ‌టం.. ఈ అంశంపై టీఆర్ ఎస్ వ‌ర్గాలు సౌండ్ చేయ‌కుండా ఉండిపోవ‌టం తెలిసిందే.  ఇదిలా ఉండ‌గా.. మంగ‌ళ‌వారం మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది.

కేసీఆర్ ఫ్రంట్ కు సానుకూలంగా స్పందించిన జార్ఖండ్ ముక్తి మోర్చా రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే త‌న వైఖ‌రిని మార్చేసుకోవ‌టం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లో జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లోనూ.. వ‌చ్చే ఏడాది జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ తోనే క‌లిసి బ‌రిలోకి దిగ‌న‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం దీనికి సంబంధించి కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో ఒక ఒప్పందం జ‌రిగింది.

వాస్త‌వానికి ఈ రెండు పార్టీల మ‌ధ్య గ‌తంలో పొత్తు ఉండేది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు విచ్ఛిన్న‌మైంది. తాజాగా మ‌రోసారి రెండు పార్టీల మ‌ధ్య ఒప్పందం కుదిరింది. అయితే.. కేసీఆర్ ఫ్రంట్‌ కు మ‌ద్ద‌తు ఇచ్చిన రెండు రోజుల‌కే కాంగ్రెస్ తో చేయి క‌ల‌ప‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ వ్య‌వ‌హారాన్ని చూస్తే.. కేసీఆర్ పేరు వాడేసుకున్న‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెబుతున్నారు. అదెలానంటే.. కాంగ్రెస్ తో పొత్తు కోసం హేమంత్ సోరెన్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ తో క‌లిసి న‌డుస్తామ‌న్న ఒప్పందం వారం కింద‌టే జ‌రుగుతుంద‌ని ఆ పార్టీ భావించింది. కానీ.. కాంగ్రెస్ నుంచి స‌రైన స్పంద‌న రాని ప‌రిస్థితి. ఇలాంటి వేళ కేసీఆర్ మూడో ఫ్రంట్ గురించి ప్ర‌క‌ట‌న చేయ‌టం.. ఆ వెంట‌నే సోరెన్ త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌టంతో కాంగ్రెస్ అలెర్ట్ అయ్యింది.

తెర వెనుక పొత్తు అంశంపై సోరెన్ తో కాంగ్రెస్ నేత‌లు చ‌ర్చ‌లు మొద‌లెట్టారు. తాను కోరుకున్న‌ట్లుగా కాంగ్రెస్ నుంచి రియాక్ష‌న్ రావ‌టంతో.. కేసీఆర్ కు హ్యాండిచ్చి రాహుల్ తో క‌లిసి రానున్న రాజ్య‌స‌భ మొద‌లు.. రాష్ట్ర అసెంబ్లీ.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కూ రెండు పార్టీలు క‌లిపి ప‌ని చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు. మొత్తానికి కేసీఆర్ ఫ్రంట్ ను బూచిగా చూపించి త‌న ప‌ని తాను పూర్తి చేసుకోవ‌టంలో సోరెన్ స‌క్సెస్ అయ్యారు. మ‌రి.. ఇలాంటి వారిని న‌మ్ముకొని కేసీఆర్ బ‌రిలోకి దిగితే.. మొద‌టికే మోసం రావ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి.. ఇలా హ్యాండిచ్చే వారి విష‌యంలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News