విభ‌జ‌న పాపం బాబు ఖాతాలో వేసేశాడు

Update: 2017-11-17 05:14 GMT
సినిమాలు చేసుకుంటూ త‌న దారిన తాను అన్న‌ట్లుగా ఉండే న‌టుడు శివాజీ. సినిమాల్లో యాక్టివ్‌ గా ఉన్న‌ప్పుడు అత‌నిపై పెద్ద‌గా వార్త‌లు వ‌చ్చింది లేదు. విభ‌జ‌న స‌మ‌యంలో సామాజిక అంశాల‌పై స్పందిస్తూ ఆందోళ‌న‌ల్ని మెద‌లెట్టిన శివాజీ విభ‌జ‌నపై త‌న ఆక్రోశాన్ని వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

విభ‌జ‌న అసంతృప్తి.. ఏపీకి ఇస్తామ‌న్న ప్ర‌త్యేక హోదాను కేంద్రం ప‌క్క‌న పడేయ‌టంపై ఆయ‌న ఇప్ప‌టికే ప‌లుమార్లు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కున్న ప‌రిమిత వ‌న‌రుల‌తో ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు కూడా. అయినా అంత ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. మిగిలిన టాలీవుడ్ న‌టుల‌తో పోలిస్తే.. ఏపీ కోసం.. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం ఎంతోకొంత ప్ర‌య‌త్నం చేసిన న‌టుడిగా శివాజీని చెప్పాలి. అలాంటి ఆయ‌న‌.. కొద్దికాలంగా కామ్‌ గా ఉన్నారు.  విభ‌జ‌న‌.. ప్ర‌త్యేక హోదా అంశాల్లో  త‌న‌కున్న అసంతృప్తిని  ఇప్ప‌టికే ప‌లుమార్లు బ‌య‌ట‌పెట్టిన శివాజీ తాజాగా మ‌రోసారి ఈ అంశాల్ని తెర మీద‌కు తీసుకొచ్చారు.

హోదా అంశంపై ఛ‌లో అమ‌రావ‌తి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి.. అఖిల‌ప‌క్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకురావాల‌న్న  వాద‌న‌ను వినిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. విభ‌జ‌న‌కు అస‌లు కార‌ణం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని.. ఆయ‌న కానీ విభ‌జ‌న‌కు  ఒప్పుకోక‌పోయి ఉంటే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విభ‌జ‌న జ‌రిగేది కాద‌న్నారు. విభ‌జ‌న‌కు బాబు మ‌ద్ద‌తు ఇచ్చిన త‌ర్వాత మాత్ర‌మే రాష్ట్ర విభ‌జ‌న వ్య‌వ‌హారం ఊపందుకున్న విష‌యాన్ని గుర్తు చేశారు.

విభ‌జ‌న విష‌యంలో నిల‌దీయాలంటే తొలుత ఏపీ ముఖ్య‌మంత్రి బాబునే  నిల‌దీయాల‌న్న శివాజీ.. చంద్ర‌న్న కానుక లాంటి కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌కు ప‌ప్పుబెల్లాలు పంచి రాష్ట్ర ఖ‌జానా మీద రూ.33వేల కోట్ల భారాన్ని మోపార‌న్నారు. రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమీ లేద‌ని తేల్చిన శివాజీ హోదా మీద మ‌రోసారి త‌న ఆందోళ‌న‌ను ఉధృతం చేస్తామ‌న్నారు. విభ‌జ‌నను వ్య‌తిరేకించే క్ర‌మంలో ఆందోళ‌న‌ల‌లో మునిగిపోయిన ఏపీ ప్ర‌జానీకంలో చాలామంది విభ‌జ‌న‌కు అస‌లు కార‌ణం చంద్ర‌బాబేన‌న్న విష‌యాన్ని ప‌ట్టించుకోని వేళ‌.. శివాజీ త‌న వ్యాఖ్య‌ల‌తో బాబు మీద స‌రికొత్త బాంబు వేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News